దీపావళికి తెలుగు సినిమా అనాథే

దీపావళికి తెలుగు సినిమా అనాథే

తెలుగు సినిమాకు సంబంధించినంత వరకు సంక్రాంతి అతి పెద్ద సీజన్. ఆ తర్వాత వేసవి, దసరా సీజన్ల మీద బాగా ఫోకస్ పెడతారు. మన పండుగ కాని క్రిస్మస్‌కు కూడా బాగానే సందడి ఉంటుంది. కానీ తెలుగువాళ్లకు అతి పెద్ద పండుగల్లో ఒకటైన దీపావళి మీద మాత్రం సినీ జనాలు అంతగా దృష్టిసారించకపోవడం ఆశ్చర్యమే.
ఇండియాలో మిగతా ఇండస్ట్రీలన్నింట్లోనూ దీపావళికి పెద్ద పెద్ద సినిమాలు రిలీజవుతాయి. దీన్ని చాలా మంచి సీజన్‌గా భావిస్తారు. తమిళంలో అయితే సంక్రాంతికి దీటుగా దీపావళికి భారీ చిత్రాలు రిలీజవుతాయి.

కొన్నేళ్లుగా దళపతి విజయ్ ప్రతి దీపావళికీ తన సినిమాను రేసులో నిలబెడుతున్నాడు. అతడికి పోటీగా కూడా హీరోలు రేసులో నిలుస్తున్నారు. ఈ ఏడాది విజయ్ చిత్రం ‘బిగిల్’ భారీ అంచనాలతో థియేటర్లలో దిగుతోంది. దానికి తోడు కార్తి సినిమా ‘ఖైదీ’ కూడా వస్తోంది.

ఇక హిందీలో ఏమో.. ‘హౌస్ ఫుల్-4’ లాంటి భారీ చిత్రంతో పాటు ‘మేడిన్ చైనా’ అనే మరో పెద్ద సినిమా కూడా దీపావళికే విడుదల అవుతున్నాయి. వేరే ఇండస్ట్రీల్లో ఇంత సందడి నెలకొంటే మన దగ్గర కనీసం ఒక్క రిలీజ్ కూడా లేకపోవడం విచారకరం.

పోయినేడాది దీపావళికి విజయ్ సినిమా ‘సర్కార్’ రిలీజ్ చేస్తే మన జనాలు ఎగబడి చూశారు. నెగెటివ్ టాక్ తెచ్చుకుని కూడా ఈ చిత్రం హిట్టయింది. దీన్ని బట్టి ఈ సీజన్లో మన జనాలు సినిమాలు చూడటానికి ఎంతో ఆసక్తితో ఉంటారన్నది స్పష్టం. కొన్నేళ్ల కిందట ‘కార్తికేయ’ సినిమాను దీపావళికి రిలీజ్ చేస్తే పెద్ద హిట్టయింది.

‘ట్యాక్సీవాలా’ సైతం దీపావళి టైంలోనే రిలీజై చాలా బాగా ఆడింది. కానీ ఈ ఏడాది మాత్రం దీపావళికి తెలుగు సినిమా అనాథ అయిపోయింది. ముందు అనుకున్నట్లు ‘వెంకీ మామ’ను ఈ పండక్కి రిలీజ్ చేస్తే మంచి ఫలితం ఉండేదేమో. అసలు తెలుగు సినిమా రేసులోనే లేకపోవడంతో ఈసారి దీపావళికి తమిళ చిత్రాలు ‘విజిల్’, ‘ఖైదీ’లతో సరిపెట్టుకోవాల్సిందే. మంచి టాక్ వస్తే అవి వసూళ్ల పంట పండించుకోవడం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English