‘బాహుబలి’ తర్వాత కూడా కథ మారలేదే..

‘బాహుబలి’ తర్వాత కూడా కథ మారలేదే..

సౌత్ సినిమాలో మొత్తం దేశవ్యాప్తంగా రిలీజవుతున్నాయి. ఉత్తరాదిన కూడా భారీగా వసూళ్లు కొల్లగొడుతున్నాయి. మన స్టార్లు దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు సుపరిచితులు అవుతున్నారు. బాలీవుడ్ వాళ్లు కథల కోసం అల్లాడుతూ.. దక్షిణాదిన ప్రతి హిట్ సినిమానూ పట్టుకుపోయి రీమేక్ చేసేస్తున్నారు.

‘బాహుబలి’ రెండు భాగాలు ఎలా వసూళ్ల ప్రభంజనం సాగించాయో.. అవార్డులు కొల్లగొట్టాయో.. ‘2.0’, ‘సాహో’ లాంటి సినిమాలు ఉత్తరాదిన ఎలా ఆదరణ పొందాయో తెలిసిందే. ఇంతగా సౌత్ సినిమా ప్రభంజనం సాగుతున్నా.. మోడీ సర్కారుకు మాత్రం ఇదేమీ కనిపించడం లేదు. బడ్జెట్ కేటాయింపుల్లో, నిధుల విడుదలలో ఎప్పుడూ చూపించే పక్షపాతమే ఇప్పుడు కూడా చూపించాడు మోడీ. ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్డే అనే అభిప్రాయంతో ఆయన వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శల పాలవుతోంది.

మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకల్ని పురస్కరించుకుని ఇండియన్ ఫిలిం సెలబ్రెటీల్ని శనివారం కలిశారు మోడీ. పేరుకు ఇండియన్ ఫిలిం సెలబ్రెటీలనే మాటే కానీ.. అక్కడ ఉన్నవాళ్లంతా ఉత్తరాది వాళ్లే. ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, కంగనా రనౌత్, అనురాగ్ బసు, ఇంతియాజ్ అలీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. ఇలా అక్కడున్న వాళ్లందరూ బాలీవుడ్ వాళ్లే. టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ కూడా హాజరైంది కానీ.. ఆమె కూడా ఉత్తరాది అమ్మాయే అన్న సంగతి తెలిసిందే. పైగా బాలీవుడ్లోనూ నటించింది.

సమాజంలో మార్పు దిశగా జనాల్లో అవగాహన పెంచేందుకు సినీ పరిశ్రమతో కలిసి పని చేసే విషయమై మోడీ ఈ సమావేశంలో సినీ ప్రముఖలతో మాట్లాడాడు. ఐతే ఫిలిం ఇండస్ట్రీ అంటే బాలీవుడ్డేనా.. దక్షిణాది సినిమా సంగతేంటి? ఇక్కడి వాళ్ల ప్రమేయం ఏమీ అవసరం లేదా? ఇక్కడి జనాల్లో అవగాహన పెంచేదెవరు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మోడీ పక్షపాతాన్ని సౌత్ జనాలు ఏకిపడేస్తున్నారు. రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఈ విషయమై మోడీని సూటిగా ప్రశ్నించింది కూడా. గాంధీజీ ఆశయాల్ని ప్రచారం చేసేందుకు ప్రభుత్వ సహకారంతో రాజ్ కుమార్ హిరానీ రూపొందించిన ప్రకటనలో సైతం మొత్తం బాలీవుడ్ వాళ్లే కనిపించడం గమనార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English