సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్.. డైరెక్ట‌ర్ నాట్ హ్యాపీ

సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్.. డైరెక్ట‌ర్ నాట్ హ్యాపీ

త‌మిళంలో ద‌స‌రా కానుక‌గా విడుద‌లైన ధ‌నుష్ సినిమా అసుర‌న్ మంచి టాక్ తెచ్చుకుని బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. ధ‌నుష్ కెరీర్లో అత్య‌ధికంగా రూ.100 కోట్ల‌కు పైగా గ్రాస్ క‌లెక్ట్ చేసింది. క్రిటిక్స్ ఈ ఏడాది వ‌చ్చిన అత్యుత్త‌మ త‌మిళ చిత్రాల్లో ఇదొక‌టిగా పేర్కొన్నారు. ప్రేక్ష‌కులు కూడా ఈ చిత్రానికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఐతే సినిమా ఇంత పెద్ద‌ విజ‌యం సాధించినా దాని ద‌ర్శ‌కుడు వెట్రిమార‌న్ సంతోషంగా లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యం. సినిమా ఔట్ పుట్ విష‌యంలో త‌న‌కు సంతృప్తి లేద‌ని అత‌ను ఓ ఇంట‌ర్వ్యూలో కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశాడు. సినిమా ఇంకా మెరుగ్గా రావాల్సింద‌ని.. కానీ నిర్మాత ఒత్తిడి కార‌ణంగా తాను రాజీ ప‌డాల్సి వ‌చ్చిందని అత‌న‌న్నాడు.

అసుర‌న్ సినిమాకు సంబంధించి ఇంకా 22 రోజుల చిత్రీక‌ర‌ణ మిగిలి ఉండ‌గా.. ఇంకో 40 రోజుల్లో సినిమా విడుద‌ల అని చెప్పార‌ని వెట్రిమార‌న్ తెలిపాడు. దీంతో హ‌డావుడిగా షూటింగ్ అవ‌గొట్టి.. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కూడా ఆద‌రాబాద‌రా చేసి సినిమాను రిలీజ్ చేయాల్సి వ‌చ్చింద‌న్నాడు వెట్రిమార‌న్. ఈ హ‌డావుడి వ‌ల్ల‌ సినిమాలో కొంత భాగాన్ని ప‌క్క‌న పెట్టాల్సి వ‌చ్చింద‌ని.. తాను అనుకున్న ప్ర‌కారం సినిమాను తీయలేక‌పోయాన‌ని వెట్రిమార‌న్ అన్నాడు.

అయితే అదృష్టం కొద్దీ ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా న‌చ్చింద‌ని, వ‌సూళ్లు కూడా బాగున్నాయ‌ని అన్నాడు వెట్రిమార‌న్. ధ‌నుష్‌తో వెట్రిమార‌న్‌ది తిరుగులేని కాంబినేష‌న్. వీళ్లిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన తొలి చిత్రం పొల్లాద‌వ‌న్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. ఆ త‌ర్వాత చేసిన ఆడుగ‌ళం కూడా పెద్ద హిట్ట‌వ‌డ‌మే కాదు.. ధ‌నుష్‌కు ఉత్త‌మ న‌టుడిగా జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. గ‌త ఏడాది ఈ జోడీ నుంచి వ‌చ్చిన వ‌డ చెన్నై కూడా హిట్టే. తాజాగా అసుర‌న్‌తో మ‌రో విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English