‘మహర్షి’కి డిజాస్టర్ రేటింగ్స్

 ‘మహర్షి’కి డిజాస్టర్ రేటింగ్స్

స్టార్ హీరోలు నటించే పెద్ద సినిమాల బాక్సాఫీస్ ఫలితంతో సంబంధం లేకుండా టీవీలో మంచి రేటింగ్సే వస్తుంటాయి. కంటెంట్ ఎలా ఉన్నా సగటున 14-15 మధ్య రేటింగ్స్ సాధించే సత్తా ఉంది మన స్టార్లకు. హిట్ సినిమాలకు 20కి అటు ఇటుగా టీఆర్పీ రావడం చూశాం. కానీ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌ల జోరు పెరిగాక ఆ ప్రభావం థియేట్రికల్ రన్ మీదే కాదు.. టీవీ రేటింగ్స్ మీద కూడా ప్రభావం చూపుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

మహేష్ బాబు కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన ‘మహర్షి’ సినిమాకు వచ్చిన రేటింగే ఇందుకు నిదర్శనం. ఇటీవలే ‘మహర్షి’కి ఓ ఛానెల్లో ప్రిమియర్ షో వేశారు. దానికి 10 లోపు టీఆర్పీ రావడం షాకింగ్‌గా మారింది. కేవలం 9.2 రేటింగ్‌తో సరిపెట్టుకుందీ చిత్రం. ఇప్పటిదాకా థియేటర్లలో హిట్ అయిన ఏ పెద్ద హీరో సినిమాకూ ఇంత తక్కువ రేటింగ్ వచ్చి ఉండదేమో.

గత కొన్నేళ్లలో మహేష్ సినిమా టీఆర్పీ రేటింగ్స్ పరిశీలిస్తే అతడి ఆల్ టైం డిజాస్టర్ ‘బ్రహ్మోత్సవం’కు అత్యల్పంగా 7.52 రేటింగ్ వచ్చింది. దాని తర్వాత మహేష్ సినిమాల్లో అత్యల్ప రేటింగ్ వచ్చింది ‘మహర్షి’కే. ఈ సినిమా థియేటర్లలో రిలీజైనపుడు మంచి టాకే వచ్చింది. ఉన్నంతలో థియేటర్లలో బాగానే ఆడింది. అయితే థియేటర్లలో ఎక్కువ కాలం ఆడటం.. ఆ తర్వాత అమేజాన్ ప్రైమ్‌లో రిలీజై అక్కడా జనాలు బాగానే చూడటం టీవీ రేటింగ్ మీద ప్రభావం చూపి ఉండొచ్చు. లేదా ప్రేక్షకులు మామూలుగానే ఈ సినిమా పట్ల ఆసక్తి ప్రదర్శించి ఉండకపోవచ్చు.

దసరా టైంలో టీవీల్లో ప్రదర్శితమైనా ఇంత రేటింగ్ తక్కువ రావడం మాత్రం ఆందోళనకరమే. ఇప్పటికే ఓవర్సీస్‌లో మహేష్ జోరు తగ్గడంపై ఆందోళన నెలకొని ఉండగా.. తాజా పరిణామాన్ని బట్టి చూస్తే మున్ముందు అతడి సినిమాల శాటిలైట్ రైట్స్ రేటు కూడా తగ్గే అవకాశముంది. మిగతా హీరోలకూ ఇదే ఇబ్బంది తలెత్తొచ్చు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English