కేకేను బలిపశువుగా మార్చేస్తున్న మీడియా?

కేకేను బలిపశువుగా మార్చేస్తున్న మీడియా?

నోట్లో నుంచి ఒక్క మాట రావటం ఆలస్యం.. మీడియా.. సోషల్ మీడియాలో చిత్రవిచిత్రమైన కథనాలు.. లాజిక్కు పాడు ఏమీ లేకుండా అల్లేస్తున్న కథనాలు పలువురు రాజకీయ నేతల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ కారణంగా చాలామంది నేతల రాజకీయ జీవితాలు తీవ్ర ప్రభావానికి లోనయ్యే పరిస్థితి. ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు కేకే అలియాస్ కేశవరావు. కాంగ్రెస్ లో మాదిరి మనసుకు ఏది తోస్తే.. అది నోటితో చెప్పకూడదన్న విషయాన్ని టీఆర్ఎస్ పార్టీలో చేరే సమయంలోనే గట్టిగా అనుకొని చేరిన కేకే.. తాను అనుకున్నట్లే ఇంతకాలం ఉండిపోయారు.

తనను ఉద్దేశించి కేసీఆర్ ఏం మాట్లాడినా.. ఎంత పొగిడినా.. పెద్దగా రియాక్ట్ కాకుండా గంభీరంగా ఉండిపోయేవారు. తాజాగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె.. ఇద్దరు కార్మికుల ఆత్మబలిదానాల నేపథ్యంలో డిస్ట్రబ్ అయిన కేకే.. సమ్మె తీవ్రను కాస్త సడలేలా.. ప్రభుత్వం చర్చలకుసిద్ధం కావాలని.. కావాలంటే తాను మధ్యవర్తిత్వం చేస్తానంటూ ఒక అడుగు ముందుకు వేశారు.

అంతే.. నాటి నుంచి కేకేకు సంబంధించిన వెల్లువెత్తుతున్న కథనాలు అన్ని ఇన్నికావు. కేకే మాటలతో కేసీఆర్ సీరియస్ అయ్యారని.. ఆయనకు క్లాస్ పీకారని.. ఆయన్ను మౌనంగా ఉండమన్నారని కొందరు.. అదేమీ కాదు.. రాజ్యసభ సభ్యుల్ని కేకే కూడగడుతున్నారని.. త్వరలో పార్టీకి చెందిన ఇతర రాజ్యసభ సభ్యులతో కలిసి టీడీపీ తమ్ముళ్లు చేసిన విధంగా బీజేపీలో విలీనం చేస్తారని మరికొందరు.. కేసీఆర్ మీద తిరుగుబాటు చేస్తారని ఇంకొందరు.. ఇలా ఎవరికి తోచింది వారు రాసేస్తున్నారు.

అరే.. నోట్లో నుంచి ఒక్క మాట వచ్చింది ఆలస్యం ఇంతలా మీద పడిపోతారా? మనసుకు నచ్చింది రాసుకోవటమే కానీ.. నిజమెంత? అబద్ధమెంత? అన్నది పట్టించుకోరా? అన్న ప్రశ్నల్ని తన సన్నిహితుల దగ్గర ఆయన సంధిస్తున్నట్లు చెబుతున్నారు. కేకే నోటి మాటతో ఆయన్ను బలిపశువుగా మీడియా కథనాలు ఉన్నాయంటున్నారు. తాజా అనుభవంతో రానున్న రోజుల్లో నోరు తెరిచి కేకే ఏమీ మాట్లాడరేమో అన్నట్లు పరిస్థితి ఉందంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English