మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు పదవీ గండం?

సంచలన ఆరోపణ ఒకటి తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద వచ్చింది. ఊహించని రీతిలో ఆయనపై వచ్చిన ఆరోపణ.. అంతకంతకూ తీవ్రమవుతోందని.. ఆయన పదవికి ఉచ్చు బిగుసుకుంటుందన్న మాట వినిపిస్తోంది. ఇంతకీ ఆయన మీద ఉన్న ఆరోపణ ఏమిటన్న విషయంలోకి వెళితే.. 2018 మహబూబ్ నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయడం తెలిసిందే. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన 2018 నవంబర్ 14న నామినేషన్ దాఖలు చేశారు.

దీనికి సంబంధించిన నామినేషన్ పత్రాల్ని ఈసీ తమ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఎన్నికలకు సంబంధించిన కీలకమైన పోలింగ్ ఫలితాలు వెలువడటానికి సరిగ్గా రెండు రోజుల ముందు పాత అఫిడవిట్ స్థానంలో కొత్తదానిని చేర్చినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పాత అఫిడవిట్ కు బదులు.. కొత్త అఫిడవిట్ ప్రత్యక్షమైందని.. ఇదెలా సాధ్యమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

తన మీద అనర్హత వేటు పడకుండా ఉండేందుకు వీలుగా.. తాను సమర్పించిన అఫిడవిట్ ను మార్చి.. సవరించిన పత్రాల్ని ఎన్నికల అధికారులతో కుమ్మక్కై అప్ లోడ్ చేయించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. పాత అఫిడవిట్ స్థానంలో కొత్తది కనిపించటంతోకేంద్ర ఎన్నికల సంఘానికి కొందరు కంప్లైంట్ చేశారు. స్థానిక అధికారులతో కలిసి ఈసీ వెబ్ సైట్ ను ట్యాంపరింగ్ చేసినట్లుగా అందులో పేర్కొన్నారు.
ఈ కంప్లైంట్ మీద ఈసీ ఫోకస్ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి చేత నివేదిక తెప్పించుకుంది.

అందులో పేర్కొన్న దాని ప్రకారం.. స్థానిక అధికారులతో కలిసి టాంపరింగ్ చేసినట్లుగా పేర్కొన్నట్లు చెబుతున్నారు. దీంతో అలెర్టు అయిన కేంద్ర ఎన్నికల సంఘం అంతర్గతంగా సాంకేతిక టీంతో విచారణ జరుపుతోంది. ఒకవేళ.. శ్రీనివాస్ గౌడ్ చేసింది తప్పన్న విషయం తేలితే.. ఆయనపై ఐపీసీ సెక్షన్ మాత్రమేకాదు.. ఐటీ చట్టాల కింద కూడా చర్యలు తీసుకుంటారని.. ఆయనకు కాస్త దూరంగా ఉండాలన్న మాట వినిపిస్తోంది. తనపై వెల్లువెత్తుతున్న ఆరోపణలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏమని బదులిస్తారో చూడాలి.