నాగ్ కొత్త సినిమా.. ఇంకోటి తెరపైకి

నాగ్ కొత్త సినిమా.. ఇంకోటి తెరపైకి

అక్కినేని నాగార్జున కెరీర్ ఇప్పుడున్నంత దయనీయ స్థితిలో ఎప్పుడూ లేదు. ఎంత పెద్ద స్టార్‌కైనా కెరీర్లో అప్పుడప్పుడూ ఎదురు దెబ్బలు మామూలే. నాగార్జున కూడా గతంలో అలా స్ట్రగులయ్యాడు. కానీ మళ్లీ పుంజుకున్నాడు. కొన్నేళ్ల కిందట మార్కెట్ పడిపోతున్న దశలో ‘మనం’, ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాలు ఆయనకు బలంగా పుంజుకునేలా చేశాయి. కానీ ఆ ఊపును నాగ్ కొనసాగించలేకపోయాడు.

మూడేళ్ల వ్యవధిలో అరడజను ఫ్లాపులతో రేసులో బాగా వెనుకబడిపోయాడు. ముఖ్యంగా ‘ఆఫీసర్’ దెబ్బకు నాగ్ మార్కెట్ దారుణంగా దెబ్బ తినేసింది. ఆ ప్రభావం నాగ్ లేటెస్ట్ మూవీ ‘మన్మథుడు-2’ మీద కూడా గట్టిగానే పడింది. ఈ సినిమా నాగ్ కెరీర్లో మరో పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయితే నాగ్ మాత్రం దీన్నుంచి త్వరగా మూవ్ అయిపోయి కొత్త సినిమాల మీద దృష్టిసారించాడు.

ఓవైపు ‘మహర్షి’ రైటర్ సాల్మన్ దర్శకత్వంలో నాగ్ ఓ సినిమా చేయడానికి రెడీ అయినట్లుగా ఈ మధ్యే సమాచారం బయటికి వచ్చింది. ఈ సినిమా పక్కా అంటున్నారు. నాగ్ సొంత బేనర్లోనే ఇది పట్టాలెక్కుతుందని సమాచారం. మరోవైపు ‘బంగార్రాజు’ కూడా ఫైనలైజ్ అయినట్లే అని.. సాల్మన్ సినిమాకు కొంచెం ముందో వెనుకో ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంటుందని అంటున్నారు.

ఇదిలా ఉంటే నాగ్ హీరోగా ఓ కొత్త సినిమా తెరపైకి వచ్చిందిప్పుడు. హిందీలో విజయవంతం అయిన థ్రిల్లర్ మూవీ ‘రైడ్’ను తెలుగులో నాగ్ హీరోగా రీమేక్ చేస్తారంటున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, ఇలియానా జంటగా నటించారు. హిందీలో ఈ చిత్రం మంచి విజయం సాధించింది. శేఖర్ కమ్ముల-నాగచైతన్య సినిమాతో నిర్మాణంలోకి అడుగు పెడుతున్న ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ ‘రైడ్’ తెలుగు రీమేక్ హక్కులు కొన్నారని.. నాగ్‌తో రీమేక్ చేయాలని చూస్తున్నారని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English