మహేష్ అతడి రుణం ఉంచుకోవట్లేదు

మహేష్ అతడి రుణం ఉంచుకోవట్లేదు

సూపర్ స్టార్ మహేష్ బాబు సాధారణంగా తన సినిమాలు కాకుండా తన కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సినిమాల్ని మాత్రమే ప్రమోట్ చేస్తుంటాడు. తాను అప్పటికి ఓ సినిమాలో నటిస్తుంటే దాని నిర్మాతలు, ఇతర యూనిట్ సభ్యుల సినిమాలకు సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు లాంచ్ చేస్తుంటాడు.

అయితే ఇప్పుడు ఇలాంటి కనెక్షన్ ఏమీ లేకుండా ఒక సినిమా ట్రైలర్ లాంచ్ చేయబోతున్నాడు. ఆ సినిమా పేరు.. మీకు మాత్రమే చెప్తా. ఇది విజయ్ దేవరకొండ పూర్తి స్థాయి నిర్మాతగా మారి తీసిన తొలి చిత్రం. అతడిని హీరోగా నిలబెట్టిన తరుణ్ భాస్కర్‌ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు.

అనసూయ భరద్వాజ్, అభినవ్ గోమటం కీలక పాత్రలు పోషించారు. షమ్మీర్ సుల్తాన్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. వీళ్లెవరితోనూ మహేష్‌కు ఏ కనెక్షన్ లేదు.

ఐతే కొన్ని నెలల కిందట మహేష్ సినిమా ‘మహర్షి’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ అతిథిగా రావడం విశేషం. మహేష్ సినిమాకు విజయ్ గెస్ట్ ఏంటి అని అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఐతే యూత్‌లో విజయ్‌కి ఉన్న క్రేజ్ చూసి బేషజం లేకుండా అతణ్ని తన ఈవెంట్‌కు అతిథిగా పిలిచాడు మహేష్.

విజయ్ కూడా ఆ ఈవెంట్లో అతిథిలా కాకుండా మహేష్ అభిమానిలాగే మాట్లాడాడు. విజయ్ పుట్టిన రోజునే ‘మహర్షి’ విడుదలై అతను కోరుకున్నట్లుగా పెద్ద హిట్టయింది. దీంతో ఇప్పుడు విజయ్ ప్రొడ్యూసర్‌గా పరిచయం అవుతున్న చిత్ర ట్రైలర్‌ను లాంచ్ చేసి అతడి రుణం తీర్చేసుకుంటున్నాడు మహేష్.

బుధవారం సాయంత్రం ఈ ట్రైలర్ లాంచ్ అవుతోంది. పూర్తి స్థాయి ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ‘మీకు మాత్రమే చెప్తా’ చిత్రాన్ని నవంబరు 1న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English