డిజాస్ట‌ర్ స్ట్రీక్.. అప్పుడు చ‌ర‌ణ్‌, ప‌వ‌న్.. ఇప్పుడు చిరు

డిజాస్ట‌ర్ స్ట్రీక్.. అప్పుడు చ‌ర‌ణ్‌, ప‌వ‌న్.. ఇప్పుడు చిరు

తెలుగు రాష్ట్రాల్ని దాటి మార్కెట్‌ను విస్త‌రించాల‌ని మ‌న స్టార్ హీరోలు కొన్నేళ్లుగా గ‌ట్టి ప్ర‌య‌త్న‌మే చేస్తున్నారు. క‌ర్ణాట‌క‌లో ముందు నుంచి మ‌న స్టార్ల‌కు ప‌ట్టు ఉంది కానీ.. దాన్ని దాటి మార్కెట్‌ను విస్త‌రించ‌డ‌మే క‌ష్ట‌మ‌వుతోంది. అల్లు అర్జున్‌కు అనుకోకుండా కేర‌ళ‌లో ఫాలోయింగ్ వ‌చ్చింది.

బాహుబ‌లి పుణ్య‌మా అని ప్ర‌భాస్ ఉత్త‌రాదిన మాంచి ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించాడు. అంత‌కుమించి మ‌రే హీరో కూడా బ‌య‌టి రాష్ట్రాల్లో స‌త్తా చాట‌లేక‌పోతున్నారు. ఉత్త‌రాదిన ప‌ట్టు సాధించాల‌ని మెగా హీరోలు గ‌ట్టి ప్ర‌య‌త్న‌మే చేశారు. ఒక‌ప్పుడు ఆజ్‌కా గూండారాజ్, ప్ర‌తిబంద్ లాంటి సినిమాల‌తో ఓ మోస్త‌రుగా గుర్తింపు సంపాదించిన చిరు.. ఆ త‌ర్వాత మ‌ళ్లీ అటు వైపు చూడ‌లేదు.

క‌ట్ చేస్తే చాలా ఏళ్ల‌కు చిరు త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ జంజీర్ రీమేక్‌తో నేరుగా హిందీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ అది దారుణంగా బెడిసికొట్టింది. అదో పెద్ద డిజాస్ట‌ర్ అయి మ‌ళ్లీ హిందీ వైపు చూడ‌టానికే భ‌య‌ప‌డేలా చేసింది. కొన్నేళ్ల విరామం త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాను హిందీలో కూడా తీశాడు. తెలుగుతో పాటు ఒకేసారి రిలీజ్ కూడా చేశాడు. కానీ దానికీ చేదు అనుభ‌వ‌మే ఎదురైంది.

ఇప్పుడిక చిరు వీళ్లిద్ద‌రి కంటే పెద్ద ప్లాన్‌తోనే రంగంలోకి దిగాడు. బాహుబ‌లి త‌ర‌హాలో భారీగా తీసిన‌ సైరా న‌ర‌సింహారెడ్డి సినిమాను ఎన్నో ఆశ‌ల‌తో హిందీలో రిలీజ్ చేశాడు. కానీ దీనికీ ఆశించిన ఫ‌లితం రాలేదు. ప్ర‌మోష‌న్ లేక‌పోవ‌డ‌మో ఇంకో కార‌ణ‌మో కానీ.. చిరును అక్క‌డి వాళ్లు ఓన్ చేసుకోలేదు. రూ.25 కోట్ల‌కు హ‌క్కులు అమ్మితే 12 కోట్ల గ్రాస్, ఐదున్న‌ర కోట్ల దాకా షేర్ వ‌చ్చిందంతే. మొత్తానికి ముగ్గురు మెగా హీరోలూ హిందీ మార్కెట్లోకి అడుగు పెట్ట‌బోయి గ‌ట్టి ఎదురు దెబ్బ‌లే తిన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English