కేంద్రంపై జ‌గ‌న్ మౌన‌మేల?

రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఇచ్చిన హామీలు ఇప్ప‌టివ‌ర‌కూ అమ‌లు చేయ‌లేదు. దానిపై ప్ర‌శ్నిస్తే కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రావ‌డం లేదు. ప్ర‌త్యేక హోదా స‌హా ఏ విషయంపైనా మోడీ స‌ర్కారు ఏపీ ప‌ట్ల సానుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు ఏపీలో అధికార జ‌గ‌న్ ప్ర‌భుత్వం.. కేంద్ర స‌ర్కారుకు మాత్రం మ‌ద్ద‌తునిస్తుంద‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. కానీ గ‌త కొంత కాలంగా వైసీపీ త‌న తీరు మార్చుకున్న‌ట్లే క‌నిపిస్తోంది. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం బీజేపీని ప్ర‌శ్నించేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలిసింది. కానీ ఇప్పుడు జ‌గ‌న్ మాత్రం మ‌ళ్లీ కేంద్రం తీరుపై మౌనంగా ఉండ‌డంలో అర్థ‌మేమిట‌న్నది అంతుచిక్క‌కుండా ఉంది.

అఖిల భార‌త స‌ర్వీస్ (ఏఐఎస్‌) ఉద్యోగుల‌పై కేంద్ర ప్ర‌భుత్వ పెత్త‌నాన్ని ప‌లు రాష్ట్రాలు తీవ్ర స్థాయిలో వ్య‌తిరేకిస్తున్నాయి. ఇప్ప‌టికే మోడీ స‌ర్కారు తీరును వ్య‌తిరేకిస్తూ త‌మిళ‌నాడు, కేర‌ళ‌, తెలంగాణ సీఎంలు లేఖ‌లు కూడా రాశారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ మాత్రం త‌న‌కేం ప‌ట్ట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రించ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంద‌నే టాక్ వినిపిస్తోంది. ఏపీలోని అఖిల భార‌త స‌ర్వీస్ ఉద్యోగుల‌పై కేంద్రం పెత్త‌నాన్ని ఆయ‌న స్వాగతిస్తున్నారా? అందుకే మౌనంగా ఉంటున్నారా? అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్నం అవుతున్నాయి. అఖిల భార‌త స‌ర్వీసుల కేడ‌ర్ రూల్స్- 1954కు తాజాగా కేంద్రం ప్ర‌తిపాదించిన స‌వ‌ర‌ణలు తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. కేంద్ర ప్ర‌భుత్వం ఏక‌ప‌క్ష ధోర‌ణితో ఈ స‌వ‌ర‌ణ‌లు చేసింద‌ని ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ స‌వ‌ర‌ణ‌లు చేసే స‌మ‌యంలో క‌నీసం రాష్ట్ర ప్ర‌భుత్వాల అభిప్రాయాలను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోక‌పోవ‌డాన్ని తెలంగాణ సీఎం త‌ప్పు ప‌ట్టారు. ఈ స‌వ‌ర‌ణ‌లు అమ‌ల్లోకి వ‌స్తే రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్రాధాన్య‌త కోల్పోయి నామ‌మాత్ర‌పు సంస్థ‌లుగా మిగులుతాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన స‌వ‌ర‌ణ‌ల‌పై తెలంగాణ‌తో స‌హా ప‌క్క రాష్ట్రాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తుంటే.. జ‌గ‌న్ మాత్రం కిమ్మ‌న‌డం లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఆయ‌న కేంద్రాన్ని ప్ర‌శ్నించే ప‌రిస్థితుల్లో లేర‌ని.. అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి ప్ర‌స్తుతం కేంద్రం సాయం అవ‌స‌ర‌మ‌ని అలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఆయ‌న మౌనం పాటించ‌డం వ‌ల్ల కేంద్ర ప్ర‌భుత్వ అప్ర‌జాస్వామిక విధానాల‌కు వ‌త్తాసు ప‌లుకుతున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

శీతాకాల పార్ల‌మెంట్ స‌మావేశాల్లోనూ వ‌రి కొనుగోళ్ల విష‌యంపై కేంద్రం వైఖ‌రిని నిర‌సిస్తూ తెలంగాణ మంత్రులు స‌భ‌లో ఆందోళ‌నలు చేశారు. కానీ పోల‌వ‌రం నిధుల విష‌యంపై, ప్ర‌త్యేక హోదాపై, ఇత‌ర అంశాల‌పై మాత్రం వైసీపీ నాయ‌కులు ఒక్క మాట కూడా మ‌ట్లాడ‌లేద‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. మోడీని అనే ధైర్యం ఆ పార్టీకి లేద‌నే విమ‌ర్శ‌లూ వినిపించాయి. ఇప్పుడు తాజాగా రాష్ట్రాల‌కు ప్రాధ‌న్యం త‌గ్గేలా అఖిల‌ భార‌త స‌ర్వీసుల కేడ‌ర్ రూల్స్‌కు కేంద్రం స‌వ‌ర‌ణ‌లు చేయాల‌ని చూస్తున్న‌ప్ప‌టికీ జ‌గ‌న్ ప్ర‌శ్నించ‌డం లేద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.