చ‌ర‌ణ్‌-శంక‌ర్.. ఆడియో అరాచ‌క‌మేన‌ట‌

ఇప్పుడు ఇండియా మొత్తంలో ఉన్న సంగీత ద‌ర్శ‌కుల్లో త‌మ‌న్ ఉన్నంత టాప్ ఫాంలో ఇంకొక‌రు లేరు అంటే అతిశ‌యోక్తి కాదు. త‌న చేతిలో ఉన్న సినిమాల స్కేల్, అత‌డి స‌క్సెస్ రేట్, త‌న పాట‌లకు వ‌స్తున్న రెస్పాన్స్.. ఇలా ఏ ప్ర‌మాణాల్లో చూసుకున్నా త‌మ‌న్‌కు తిరుగులేదు. ఇంత‌కుముందు త‌మ‌న్ ప‌ని చేయాల‌ని ఆశ‌ప‌డ్డ ద‌ర్శ‌కులు, హీరోలు అడిగి మ‌రీ అత‌ణ్ని సంగీత ద‌ర్శ‌కుడిగా పెట్టుకుంటున్నారు.

అలా వ‌చ్చిన అవ‌కాశ‌మే.. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తున్న‌ సినిమా. ఈ చిత్రానికి సంగీత ద‌ర్శ‌కుడిగా ఖ‌రారైన‌పుడు త‌మ‌న్ ఎంత ఎగ్జైట్ అయ్యాడో తెలిసిందే. తాజాగా సింగర్ గీతా మాధురితో క‌లిసి చేసిన‌ ఒక వీడియో లైవ్ చాట్ సంద‌ర్భంగా త‌మ‌న్ ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ.. చ‌ర‌ణ్‌ అభిమానుల్లో ఉత్సాహం తెచ్చే అప్ డేట్స్ ఇచ్చాడు.

చ‌ర‌ణ్‌-శంక‌ర్ సినిమా షూట్ ఆరంభ ద‌శ‌లోనే ఉండ‌గా.. అప్పుడే త‌మ‌న్ నాలుగు పాట‌లు పూర్తి చేసేశాడ‌ట‌. మూడు పాట‌లు కొన్ని రోజుల ముందే పూర్త‌య్యాయ‌ని.. తాజాగా ఒక పాట రికార్డింగ్ అయిపోయింద‌ని త‌మ‌న్ వెల్ల‌డించాడు. శంక‌ర్ సినిమాల్లో పాట‌లు ఎలా ఉంటాయో తెలిసిందే అని.. ఆయ‌న స్ట‌యిల్‌కు త‌న మార్కును జోడించి ఈ చిత్రానికి పాట‌లు కంపోజ్ చేశాన‌ని త‌మ‌న్ తెలిపాడు. ఈ పాట‌ల్ని శ్రోత‌లు ఎప్పుడెప్పుడు వింటారా అని ఎదురు చూస్తున్న‌ట్లు చెప్పాడు.

ఇక రామ్ చ‌ర‌ణ్ గురించి మాట్లాడుతూ.. వేరే వ్య‌క్తుల‌కు గుండె ఒక చోటే ఉంటుంద‌ని.. కానీ చ‌ర‌ణ్‌కు మాత్రం ఒళ్లంతా గుండెనే అని త‌మ‌న్ వ్యాఖ్యానించాడు. త‌మ క‌ల‌యిక‌లో వ‌చ్చిన నాయ‌క్, బ్రూస్ లీ సినిమాల కంటే కొత్త సినిమాలో ఆడియో ఇంకా బాగుంటుంద‌ని చెప్పాడు. ఈ సంద‌ర్భంగా గీతా మాధురి జోక్యం చేసుకుని సినిమాలో ఒక పాట తాను విన్నాన‌ని.. ఈ పాట రిలీజైన‌పుడు ప్ర‌పంచవ్యాప్తంగా సంగీత ప్రియులంద‌రూ త‌మ‌న్ గురించి మాట్లాడుకుంటార‌ని.. ఆ పాట రిలీజైన‌పుడు తాను ఇప్పుడు చెప్పిన మాట అంద‌రికీ గుర్తుకొస్తుంద‌ని చెబుతూ అంచ‌నాలు పెంచేసింది.