ప్రభాస్‌కు చేటు చేస్తున్న అభిమానులు?

ప్రభాస్‌కు చేటు చేస్తున్న అభిమానులు?

ప్రభాస్ కొత్త సినిమా 'సాహో' ప్రి రిలీజ్ ఈవెంట్లో దర్శక ధీరుడు రాజమౌళి ఒక మాట అన్నాడు. తెలుగులో అందరు హీరోల అభిమానులూ ఇష్టపడే హీరో ప్రభాస్ అని.. అందరూ అతడి సినిమా చూస్తారని. ఈ మాటను ఎవ్వరైనా అంగీకరిస్తారు. చాలామంది పెద్ద హీరోలకు మామూలుగా ఫ్యాన్స్‌తో పాటు యాంటీ ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తునే ఉంటారు.

సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వాళ్ల గురించి వ్యతిరేక ప్రచారాలు జరుగుతుంటాయి. కానీ ప్రభాస్ తన మంచితనం, హుందాతనం, అణకువతో తనపై అసలు వ్యతిరేకతే లేకుండా చూసుకున్నాడు. 'బాహుబలి' రెండు భాగాలతో భారీ విజయం సాధిస్తే అతడిని చూసి ఎవరూ అసూయ చెందలేదు. ఆ సినిమాల గురించి వ్యతిరేక ప్రచారం చేయలేదు. ప్రభాస్‌ను గర్వించారు తప్ప.. అతడి గురించి ఎలాంటి నెగెటివిటీ స్ప్రెడ్ చేయలేదు. 'సాహో' విడుదల ముందు వరకు పరిస్థితి ఇలాగే ఉంది.
 
కానీ ఈ సినిమా రిలీజ్ దగ్గరపడ్డప్పటి నుంచి ప్రభాస్ అభిమానుల హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది. 'బాహుబలి' వసూళ్లను, 'సాహో' బిజినెస్‌ను చూపించి వేరే హీరోల్ని తక్కువ చేసి మాట్లాడటం చాలామందికి రుచించడం లేదు. ఓవైపు ప్రభాస్ 'సాహో' ప్రమోషన్లలో ఎంతో అణకువతో మాట్లాడాడు.

చిరంజీవి, రజనీకాంత్‌లతో తనను పోలిస్తే వాళ్లు లెజెండ్స్ అంటూ పైన కూర్చోబెట్టాడు. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం 'సైరా నరసింహారెడ్డి' సినిమా విషయంలో చిరంజీవిని టార్గెట్ చేయడం, ట్రోల్ చేయడం చూసి జనాలు విస్తుబోయే పరిస్థితి కనిపిస్తోంది. 'సాహో'కు ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ 'బాహుబలి' వల్ల ప్రభాస్‌కు వచ్చిన క్రేజ్ వల్ల నార్త్ ఇండియాలో బాగా ఆడింది. ఐతే 'సైరా'కు ఉత్తరాదిన చేదు అనుభవం ఎదురైంది.

ఈ నేపథ్యంలో రెండు సినిమాల్ని పోల్చి చిరును తక్కువ చేసి మాట్లాడటం.. సినిమాలో ఆయన లుక్ గురించి కామెంట్లు చేయడం ద్వారా ప్రభాస్ అభిమానులు తమ హీరో మీద మెగా అభిమానుల్లో వ్యతిరేకత పెరిగేలా చేస్తున్నారు. వీళ్ల అతితో మెగా అభిమానులు రెచ్చిపోయి ప్రభాస్ గాలి తీసే ప్రయత్నం చేస్తున్నారు.

'సాహో' యాక్షన్ సీక్వెన్స్‌లో ప్రభాస్ డూప్‌ను వాడటం, గుర్రాలు, ఏనుగుల బదులు బొమ్మల్ని ఉపయోగించడం గురించి ప్రస్తావిస్తూ ఫొటోలు పెట్టి అతడిని ట్రోల్ చేస్తున్నారు. మొత్తంగా చిరు-ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య రచ్చ పెద్ద స్థాయిలోనే నడుస్తోంది. చిరు స్థాయి ఏంటో చూడకుండా ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన్ని ట్రోల్ చేయడం ద్వారా తమ హీరో మీద నెగెటివిటీ పెంచి చేటు చేస్తున్నారనే విషయాన్ని త్వరగా గుర్తిస్తే మంచిది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English