చిరు-చరణ్ రేసు అదిరిందిగా..

చిరు-చరణ్ రేసు అదిరిందిగా..

కొడుకును జయించే తండ్రి.. తండ్రిని గెలిచే కొడుకు.. మెగా తండ్రీ కొడుకుల మధ్య రేసు రసవత్తరంగా సాగిపోతోంది. చిరు  సినిమాలకు దూరం అయిన కొంత కాలానికి చరణ్ ‘మగధీర’తో మెగా హిట్ కొట్టి అంతకుముందు చిరు పేరిట ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టాడు. ఐతే మూడేళ్ల కిందట దాదాపు దశాబ్ద విరామం తర్వాత ‘ఖైదీ నంబర్ 150’తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన చిరు.. మళ్లీ బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటాడు. చరణ్ మీద గెలిచాడు.

అప్పటి నాన్-బాహుబలి రికార్డులన్నీ బద్దలు కొట్టేసి రూ.105 కోట్ల షేర్‌తో కొత్త రికార్డు నెలకొల్పాడు. ఆ తర్వాత చిరును ఇంకే యువ కథానాయకుడూ గెలవలేదు. చిరు తనయుడు చరణే వచ్చాడు. గత ఏడాది ‘రంగస్థలం’తో తిరుగులేని విజయాన్నందుకున్నాడు. ‘ఖైదీ నంబర్ ‘150’ పేరిట ఉన్న నాన్-బాహుబలి రికార్డును బద్దలు కొట్టి రూ.128 కోట్ల షేర్‌తో కొత్త రికార్డు నెలకొల్పాడు.

గత ఏడాదిన్నరలో ‘రంగస్థలం’ రికార్డును అందుకోవడానికి పెద్ద సినిమాలు చాలానే ట్రై చేశాయి. చరణ్ సైతం తన రికార్డును అందుకోలేకపోయాడు.‘సాహో’ నాన్-బాహుబలి రికార్డును నెలకొల్పినా.. అది వివిధ భాషల వసూళ్లతో సాధించింది. కానీ తెలుగు వెర్షన్‌‌ నాన్-బాహుబలి రికార్డుకు అది చాలా దూరంలో ఆగిపోయింది.  ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవే మళ్లీ కొడుకు రికార్డును బద్దలు కొట్టే దిశగా సాగుతున్నాడు.

ఆయన కొత్త సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ వరల్డ్ వైడ్ ఇప్పటికే రూ.125 కోట్ల షేర్ మార్కును అందుకుంది. అందులో తెలుగు వెర్షన్ వసూళ్లే రూ.110 కోట్లకు పైగా ఉండటం విశేషం. ఈ సినిమా ఫుల్ రన్లో ‘రంగస్థలం’ పేరిట ఉన్న నాన్-బాహుబలి తెలుగు సినిమా రికార్డును అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి తండ్రి రికార్డును కొడుకు కొడితే.. కొడుకు రికార్డును తండ్రే అందుకోవడం విశేషమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English