దిల్ రాజు సినిమా.. అయినా చప్పుడు లేదే

దిల్ రాజు సినిమా.. అయినా చప్పుడు లేదే

పెద్ద నిర్మాతలు చిన్న సినిమాల్ని తమ చేతుల్లోకి తీసుకుని.. తమ బేనర్ల ద్వారా రిలీజ్ చేయడం టాలీవుడ్లో చాన్నాళ్లుగా ఉన్న సంప్రదాయమే. దిల్ రాజు, సురేష్ బాబు లాంటి అగ్ర నిర్మాతలు తరచుగా ఇలా సినిమాలు రిలీజ్ చేస్తుంటారు. ఐతే ఒకప్పుడు వాళ్లు అసోసియేట్ కాగానే.. జనాలకు ఆ సినిమాల మీద ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడేది.

 కానీ ఈ మధ్య ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఈ నిర్మాతల మీద ప్రేక్షకులకు నమ్మకం సన్నగిల్లినట్లుంది. దిల్ రాజు ఆహా ఓహో అన్న సినిమాలు కొన్ని బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ‘నేను నాన్న నా బాయ్ ఫ్రెండ్స్’, ‘వెళ్లిపోమాకే’, ‘మెహబూబా’ లాంటి సినిమాలు అందుకు రుజువు.

సురేష్ బాబు అసోసియేట్ అయిన ‘అదిగో’తో పాటు  కొన్ని సినిమాలు బోల్తా కొట్టాయి. దీంతో వీళ్లపై నమ్మకం  తగ్గిపోయింది ప్రేక్షకులకు. తాజాగా దిల్ రాజు ‘ఎవరికీ చెప్పొద్దు’ అనే చిన్న సినిమాను తన బేనర్ ద్వారా రిలీజ్ చేశాడు.

దసరా కానుకగా మంగళవారమే ఈ చిత్రం రిలీజైంది. ‘బాహుబలి’ సినిమాలో సేనాధిపతిగా నెగెటివ్ రోల్ చేసిన రాకేష్ వర్రె (బాహుబలి నిండు సభలో తల నరికే క్యారెక్టర్), గార్గేయి అనే కొత్తమ్మాయి జంటగా నటించిన సినిమా ఇది. ఈ మూవీ నచ్చి దిల్ రాజు తన బేనర్ మీద రిలీజ్ చేశాడు. అయితే నిన్న ఈ చిత్రం విడుదలైన సంగతి కూడా జనాలకు తెలియని పరిస్థితి. తన బేనర్ పోస్టర్ మీద వేసినందుకైనా రాజు.. కాస్త ఈ సినిమాను ప్రమోట్ చేసి ఉండాల్సింది.

తాను ఈ సినిమాతో అసోసియేట్ అయినట్లు జనాలకు తెలిసేలా చేయాల్సింది. దిల్ రాజు మెచ్చిన సినిమా, ఆయన రిలీజ్ చేసిన సినిమా అంటే జనాల్లో కాస్తయినా ఆసక్తి కలిగేది. సినిమా పర్వాలేదంటున్నారు కానీ.. గొప్ప టాక్ అయితే లేదు. ‘సైరా’ దూకుడు నేపథ్యంలో ‘చాణక్య’ లాంటి సినిమాకే బజ్ రాలేదు. ఇక కొత్తవాళ్లు చేసిన సినిమాను ఎలా పట్టించుకుంటారు. సినిమా వచ్చినట్లు కూడా జనాలకు తెలియకుండానే వెళ్లిపోతుందేమో అనిపిస్తోంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English