వర్మ సినిమా ట్రైలర్.. టార్చర్ గ్యారెంటీడ్

వర్మ సినిమా ట్రైలర్.. టార్చర్ గ్యారెంటీడ్

గత దశాబ్ద కాలంలో రామ్ గోపాల్ వర్మను నమ్మి జనాలు చాలాసార్లు బలైపోయారు. సినిమాల మేకింగ్‌ మీద కాకుండా ప్రమోషన్ల మీద బాగా దృష్టిపెడుతున్న వర్మ.. జనాల్ని థియేటర్ల వరకు తీసుకురావడంలో మాత్రం బాగానే విజయవంతం అవుతున్నాడు.

తీరా థియేటర్లలోకి అడుగు పెట్టాక ప్రేక్షకులతో నరకానికి స్పెలింగ్ రాయిస్తున్నాడు. ఆ టార్చర్ ఎలా ఉంటుందో గత కొన్నేళ్లలో థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసిన వాళ్లకు బాగానే తెలుసు. ఒకప్పుడు అద్భుతమైన సినిమాలు తీసిన మీరు ఇలా తయారయ్యారేంటి అంటే.. నా మీద అంచనాలు పెంచుకుని రావడం మీ తప్పు అని ఎదురు దాడి చేసి నోళ్లు మూయించగల సమర్థుడు వర్మ. ఆయన మీద ఉన్న విపరీతమైన అభిమానాన్ని చంపుకుని సైలెంటైపోయిన డైహార్డ్ ఫ్యాన్స్ లక్షల్లో ఉన్నారు. అయినా వర్మ సినిమాలు తీయడం మానట్లేదు. జనాల్ని ఎలాగోలా ఆకర్షించడమూ మానట్లేదు.

తాజాగా వర్మ నుంచి ‘బ్యూటిఫుల్’ అనే సినిమా రాబోతోంది. ఇది ఆయన కల అట. వర్మ కెరీర్ ఆరంభంలో తీసిన క్లాసిక్ ‘రంగీలా’కు ఇది మోడర్న్ వెర్షన్. తాజాగా మూడు నిమిషాల నిడివితో దీని ట్రైలర్ లాంచ్ చేశారు. ‘వంగవీటి’ సినిమాలో వంగవీటి రత్నకుమారి పాత్ర పోషించిన బెంగాలీ నటి నైనా గంగూలీ ఇందులో కథానాయికగా నటించింది. ఓ కొత్త కుర్రాడు హీరోగా చేశాడు. వీళ్లిద్దరూ పేదరికంలో ఉండగా గాఢమైన ప్రేమలో ఉంటారు.

ఆ ప్రేమను గాఢమైన ముద్దులు, ఇంటిమేట్ సీన్ల ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. ట్రైలర్లో రెండు నిమిషాల పాటు అవే ఉన్నాయి. ఐతే పేదరికంలో ఉండగా వీళ్ల మధ్య ఉన్న గాఢమైన ప్రేమ.. ఆ అమ్మాయి రిచ్ అయ్యాక పక్కకు వెళ్లిపోతుంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య సాగే సంఘర్షణ నేపథ్యంలో సాగే సినిమా ఇది.

రంగీలాను మ్యాచ్ చేయడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ.. దాని దరిదాపుల్లోకి కూడా ఈ సినిమా వెళ్లే సంకేతాలు కనిపించడం లేదు. 90ల్లో అయితే హీరోయిన్ని సెక్సీగా చూపించి థియేటర్లకు రప్పించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మొబైల్లో కావాల్సినంత అడల్ట్ కంటెంట్ ఉండగా.. ఇలాంటి సినిమాలు చూసేందుకు ఎవరొస్తారు. పైగా వర్మ సినిమాల్లో ఒకప్పుడు కనిపించిన కళాత్మకత ఇప్పుడెంతమాత్రం అగుపించట్లేదు.

నైనా అనే అమ్మాయికీ అంత ఆకర్షణ లేదు. కొన్ని ఫ్రేమ్స్ బాగున్నప్పటికీ.. కథాంశం అయితే రొటీన్ అనిపిస్తోంది. సినిమాకు వెళ్తే టార్చర్ గ్యారెంటీ అనే సంకేతాలే ఇచ్చింది ట్రైలర్. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు వర్మతో కలిసి దర్శకత్వం వహించిన అగస్త్యమంజు ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English