అల్లరోడి సినిమా అసలు బయటికొస్తుందా?

అల్లరోడి సినిమా అసలు బయటికొస్తుందా?

అమేజాన్ ప్రైమ్ లాంటి ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ సినిమాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో నెమ్మదిగా మన ఫిలిం మేకర్స్‌కు బాగానే అర్థమవుతున్నట్లుంది. ఇవి అరంగేట్రం చేయడానికి ముందే సినిమాలకు లాంగ్ రన్ కష్టంగా మారింది. ఇక అమేజాన్ ప్రైమ్ రాకతో పరిస్థితి మరీ సంక్లిష్టంగా మారింది. వీకెండ్లో సినిమా చూస్తే చూసినట్లు. లేదంటే తర్వాత జనాలు థియేటర్లకు రావట్లేదు.

ముందే సినిమాకు హైప్ తీసుకొచ్చి వీకెండ్లో బుకింగ్స్ చేయించగలిగితే ఓకే.. లేదంటే సినిమాలకు దారుణమైన ఫలితాలు వస్తున్నాయి. గోపీచంద్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో సినిమా ‘చాణక్య’ పరిస్థితి ఏమైందో చూశాం. ఇక చిన్నా చితకా హీరోల పరిస్థితి దయనీయంగా ఉంది. సినిమాలు తీస్తున్నారు కానీ.. బిజినెస్ చేసుకోవడం చాలా చాలా కష్టమైపోతోంది. ఈ క్రమంలోనే అల్లరి నరేష్ కొత్త సినిమా ‘బంగారు బుల్లోడు’ ముందుకు కదలని పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం.

నరేష్ మార్కెట్ కోల్పోయి చాలా కాలం అయింది. గత ఐదారేళ్లలో అతడి సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. ఓ మోస్తరు విజయం సాధించిన సినిమా కూడా ఒక్కటీ లేదు. ‘మేడమీద అబ్బాయి’, ‘సిల్లీ ఫెలోస్’ లాంటి సినిమాలకు రిలీజ్ ఖర్చులు కూడా రాలేదు. ఈ మధ్య అతను హీరోగా ‘బంగారు బుల్లోడు’ అనే సినిమా మొదలుపెట్టారు. ‘నందిని నర్సింగ్ హోం’తో దర్శకుడిగా పరిచయమైన గిరి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. అనిల్ సుంకర నిర్మాత. ‘బంగారు బుల్లోడు’ను అసలు సేల్ చేసుకునే పరిస్థితే కనిపించడం లేదట.

ఆల్రెడీ ‘చాణక్య’తో గట్టి ఎదురు దెబ్బ తిన్న అనిల్.. ‘బంగారు బుల్లోడు’ మీద పూర్తిగా ఆశలు కోల్పోయాడట. దీపావళికి ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్న అనిల్.. ఆ ఆలోచనను విరమించుకున్నాడట. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమాకు బిజినెస్ జరిగే పరిస్థితి లేదు. ‘మహర్షి’ సినిమాలో ప్రత్యేక పాత్రతో నరేష్‌కు పేరొచ్చినా.. సోలో హీరోగా అతడి మార్కెట్‌కు అది ఏమాత్రం ప్లస్ కాలేదు.  దీంతో అసలు ‘బంగారు బుల్లోడు’ సినిమా పూర్తవుతుందా.. విడుదల చేస్తారా లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English