రాయలసీమ క్వీన్ మళ్లీ పార్టీ మారుతోందా?

ఎటు గాలి వీస్తే అటు వెళ్లిపోవ‌డం రాజ‌కీయ నాయ‌కుల‌కు అల‌వాటే. త‌మ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం పార్టీలు మార‌డం సాధార‌ణ‌మే. అలా ఎన్నిసార్ల‌యినా చేయ‌డానికి వెనుకాడ‌రు. తాజాగా ఏపీలో మాజీ ఎంపీ బుట్టా రేణుక కూడా మ‌రోసారి జంప్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌నే టాక్ వినిపిస్తోంది. మ‌ళ్లీ త‌ట్టా బుట్టా స‌ర్దుకుని వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లేందుకు ఆమె సిద్ధ‌మ‌వుతున్నార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. అందుకు తాజా రాజ‌కీయ ప‌రిణామాలే కార‌ణ‌మ‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

రాజ‌కీయాల్లోకి అడుగుపెట్ట‌గానే రేణుక ఎంపీ అయ్యారు. 2014లో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఆమెకు జ‌గ‌న్ క‌ర్నూలు పార్ల‌మెంట్ సీటు క‌ట్ట‌బెట్టారు. ఆ ఎన్నిక‌ల్లో ఆమె 40 వేల పైచిలుకు మెజారిటీతో టీడీపీ అభ్య‌ర్థి బీటీ నాయుడిపై గెలిచారు. మ‌రోవైపు ఆమె భ‌ర్త శివ నీల‌కంఠ మొద‌టి నుంచి టీడీపీ సానుభూతి ప‌రుడిగా ఉన్నారు. ముందుగానే ఆయ‌న టీడీపీలో చేరారు. ఎంపీగా గెలిచిన త‌ర్వాత రేణుకు కూడా వైసీపీకి దూరంగా ఉంటూ టీడీపీకి ద‌గ్గ‌రైంది.

కానీ 2019 ఎన్నిక‌ల్లో క‌ర్నూలు టికెట్‌ను కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డికి బాబు ఇవ్వ‌డంతో ఆమె తిరిగి వైసీపీలోకి వెళ్లారు. కానీ ఆ ఎన్నిక‌ల్లో ఆమెకు జ‌గ‌న్ టికెట్ ఇవ్వ‌లేదు. పోనీ ఆ త‌ర్వాత‌నైనా ఎమ్మెల్సీగా చేస్తార‌ని ఎదురు చూసిన ఆమెకు నిరాశే మిగిలింది. ఒక‌సారి పార్టీ నుంచి వెళ్లిపోయి మ‌ళ్లీ వ‌చ్చిన నేత‌ల‌కు జ‌గ‌న్ ప్రాధాన్య‌త ఇవ్వ‌ర‌ని నిపుణులు అంటున్నారు. ఈ నేప‌థ్యంలో రేణుక మ‌రోసారి టీడీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్లో ఏదో ఒక‌టి ఇస్తామ‌ని చంద్రబాబు హామీ ఇస్తే పార్టీలో చేరేందుకు ఆమె సిద్ధంగా ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ సారి క‌ర్నూలు ఎంపీ సీటును కొత్త‌వాళ్ల‌కు ఇచ్చేందుకు బాబు ఆలోచిస్తున్నార‌ని అలాగే ఎమ్మిగ‌నూరు అసెంబ్లీ స్థానానికి అభ్య‌ర్థిని మార్చే అవ‌కాశాలు ఉన్నాయ‌నే టాక్ వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం ఆమె సైకిల్ ఎక్కేందుకు సై అంటున్నారు. క‌ర్నూలు పార్ల‌మెంట్ లేదా ఎమ్మిగ‌నూరు అసెంబ్లీ సీటులో ఏదో ఒక‌టి ఇస్తామ‌నే హామీ వ‌స్తే వెంట‌నే ఆమె టీడీపీలో చేర‌తార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.