వినాయక్.. ప్రయోగమేమీ కాదన్నమాట

వినాయక్.. ప్రయోగమేమీ కాదన్నమాట

మొత్తానికి టాలీవుడ్లో ఒక ఆసక్తికర ప్రాజెక్టు గురించి అధికారికంగా వెల్లడించేశారు. స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్‌ను హీరోగా పరిచయం చేస్తూ దిల్ రాజు నిర్మిస్తున్న కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. ఈ చిత్రానికి ‘సీనయ్య’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో వినాయక్ కార్ మెకానిక్ పాత్ర చేస్తున్నాడు. ఫస్ట్ లుక్‌తోనే ఆ విషయాన్ని రివీల్ చేసేశారు.

ఖాకీ ప్యాంటు, భుజంపై ఎర్రటి రుమాలు, చేతిలో రించ్, బ్యాగ్రౌండ్లో కారు, దుమ్ము.. ఇవన్నీ చూస్తే హీరో నేపథ్యమేంటో స్పష్టంగా తెలిసిపోయింది. ఇంతకుముందు ‘శరభ’ అనే సినిమా తీసిన ఎన్.నరసింహారావు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. వినాయక్ దర్వకత్వం వహించిన ఎన్నో సినిమాలకు సంగీతం అందించిన సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఈ చిత్రానికి మ్యూజిక్ చేస్తున్నాడు.

వినాయక్ హీరోగా మారుతున్నాడు అనగానే జనాలు ఎంతగా షాకయ్యారో తెలిసిందే. ఆయన హీరోగా చేసే కథ ఎలాంటిదై ఉంటుందా అన్న ఆలోచన అందరిలోనూ వచ్చింది. ఇదొక ప్రయోగాత్మక కథ అని ఊహాగానాలు వచ్చాయి. కానీ ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, బ్యాక్ డ్రాప్ చూస్తే అలాంటి ఫీలింగ్స్ ఏమీ కలగట్లేదు. సగటు మాస్ కథతోనే వినాయక్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారనిపిస్తోంది.

ఒకప్పుడు దాసరి నారాయణరావు ప్రధాన పాత్రలో నటించిన కొన్ని సినిమాల్ని తలపిస్తోందేమో ఈ చిత్రం అనిపిస్తోంది. మరి వినాయకే ఈ కథ చేయాల్సిన అవసరం ఏంటి అన్నది రేప్పొద్దున సినిమా చూస్తేనే కానీ అర్థం కాదేమో. ఇదిలా ఉంటే.. సినిమాకు ‘శీనయ్య’ అని కాకుండా ‘సీనయ్య’ అని టైటిల్ పెట్టడం అంటే స్పెల్లింగ్ మిస్టేకే. శ్రీనివాస్ పేరును షార్ట్ చేసినా.. శీను అవుతుంది లేదంటే శీనయ్య అవుతుంది తప్ప ‘సీను’ కానీ, ‘సీనయ్య’ కానీ అవ్వదు. వాడుకలో అనుకున్నా కూడా ఈ టైటిల్ తప్పే. అది కాస్త చూసుకుని ఉండాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English