ఇలాంటి కథలు బయటికి తీయండబ్బా

ఇలాంటి కథలు బయటికి తీయండబ్బా

సరిగ్గా తీస్తే బయోపిక్స్ ఎంత బాగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయో గత ఏడాది 'మహానటి' సినిమా రుజువు చేసింది. అప్పటిదాకా తెలుగు ప్రేక్షకుల్లో బయోపిక్స్ పట్ల అంత సానుకూల అభిప్రాయం లేదు. హిందీలో ఈ జానర్లో చాలా సినిమాలొచ్చినా.. తెలుగులో మాత్రం అలాంటి ప్రయత్నాలు అరుదే.

ఐతే 'మహానటి' చూశాక ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ జనాల అభిప్రాయం కూడా మారిపోయింది. బయోపిక్‌తో ప్రేక్షకులను ఎమోషనల్‌గా ఎంత బాగా కనెక్ట్ చేయొచ్చో ఈ సినిమా చూసి తెలుసుకున్నారు. కానీ దీని స్ఫూర్తితో తీసిన 'యన్.టి.ఆర్' సినిమా బోల్తా కొట్టడంతో మళ్లీ బయోపిక్‌ల భవిష్యత్ మీద నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే అందరికీ తెలిసిన కథల్ని తెరమీదికి తేవడం, వాస్తవాల్ని వక్రీకరించడం, దాచేయడం ఈ సినిమాకు చేటు చేశాయన్నది వాస్తవం.

ఇప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా సంగతి తీసుకుంటే చిత్ర బృందం దాన్ని ఒక బయోపిక్‌లాగా వాస్తవానికి దగ్గరగా తీయలేదు. జనాలు కూడా దాన్ని ఆ దృష్టితో చూడలేదు. కాబట్టి దాన్ని పక్కన పెట్టేయాలి. అయితే త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'జార్జి రెడ్డి' సినిమా ట్రైలర్ తాజాగా లాంచ్ చేశారు. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని సందీప్ అందులో హీరోగా నటించాడు. దీని దర్శకుడు జీవన్ రెడ్డి అప్పుడెప్పుడో 'దళం' అనే సినిమా తీసి మాయమయ్యాడు.

నిర్మాతలు కొత్తవాళ్లు. అయితేనేం.. ట్రైలర్ చూడగానే ప్రేక్షకులు ఈజీగా కనెక్టయి పోయారు. జార్జిరెడ్డి గురించి ఈ తరానికి పెద్దగా తెలియకపోవడం, ఆయన జీవితంలో ఎన్నో ఆసక్తికర పరిణామాలు ఉండటంతో ట్రైలర్ ప్రేక్షకుల్లో ఒక ఎమోషన్ తీసుకురావడంలో విజయవంతం అయింది. ఇమేజ్ లేని నటుడు ఇందులో నటించినా సరే.. కొన్ని చోట్ల ప్రేక్షకులకు ఒక రియల్ హీరోను చూసిన భావన కలిగింది.

చరిత్రలో ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. మరుగున పడ్డ మంచి కథలు చాలానే ఉంటాయి. అలాంటి వాటిని బయటికి తీసి సరిగ్గా ప్రెజెంట్ చేస్తే అద్భుతమైన ఫలితాలొస్తాయి. జార్జి రెడ్డి సినిమా హిట్టయితే కచ్చితంగా ఇలాంటి ప్రయత్నాలు మరిన్ని జరుగుతాయనడంలో సందేహం లేదు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English