మాట నిలబెట్టుకున్న రజనీ.. ఇల్లు కొనిచ్చేశారు

మాట నిలబెట్టుకున్న రజనీ.. ఇల్లు కొనిచ్చేశారు

సినీ రంగంలో ఎంతోమంది ప్రముఖులు ఉన్నా.. కొందరికి ఉండే ఇమేజ్ అంతా ఇంతా కాదు. వారి మాటలతో.. చేతలతో ఎప్పటికప్పుడు కొత్త స్ఫూర్తిని రగిలిస్తూ ఉంటారు. ఆ కోవకే చెందుతారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. మాట ఇస్తే.. తీర్చే వరకూ ఊరుకోరన్న చందంగా.. ఇటీవల తానిచ్చిన మాటను నిలబెట్టుకోవటమే కాదు.. మాట ఇస్తే.. నిలబెట్టుకునే తీరు ఇలా ఉండాలన్నట్లుగా రజనీ తీరు ఉంది. వ్యక్తిత్వం విషయంలో తనకు సాటి మరెవరూ రారన్నట్లుగా ఉన్న ఈ ఉదంతంలోకి వెళితే..

రజనీకాంత్ సోలో హీరోగా నటించిన తొలి సినిమా భైరవి. దీన్ని 1978లో విడుదల చేశారు. ఈ చిత్రాన్ని ప్రముఖ రచయిత.. నిర్మాత కలైజ్ఞానం నిర్మించారు. తాను చేసిన సినిమాల్లో తాను చేసిన భైరవి మూవీ ప్రత్యేకమని రజనీ తరచూ చెబుతుంటారు. ఇదిలా ఉంటే.. ఆగస్టు 14న కలైజ్ఞానం సన్మాన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు భారతీరాజా.. రజనీకాంత్.. శివకుమార్ తదితర చిత్ర ప్రముఖులు హాజరయ్యారు.

శివకుమార్ మాట్లాడుతూ.. కలైజ్ఞానం నేటికి అద్దె ఇంట్లో ఉంటున్నారని.. ఆయనకు సొంత ఇల్లు నిర్మించుకోవటానికి తమిళనాడు ప్రభుత్వం సాయం చేయాలన్నారు. ఈ విషయాన్ని విన్నంతనే స్పందించిన రజనీ.. తానే ఇల్లు కొనిస్తానని.. ఆ అవకాశం తమిళనాడు ప్రభుత్వానికి ఇవ్వనని చెప్పారు. ఆ సందర్భంగా ఆయన నోటి నుంచి.. త్వరలోనే కలైజ్ఞానంకు సొంత ఇల్లు ఉంటుందన్నారు.

కట్ చేస్తే.. చెప్పిన మాటకు కట్టుబడి ఉన్న రజనీ.. వేదిక మీద మాట ఇవ్వటమే కాదు.. దాన్ని ఆచరణలో చూపి.. రెండు నెలల కంటే తక్కువ వ్యవధిలోనే ఒక ఇంటిని కొనుగోలు చేశారు. దాదాపు కోటి రూపాయిలకు పైనే విలువ ఉంటుందన్న ఇంటిని కలైజ్ఞానంకు కానుకగా ఇచ్చారు. ఈ రోజు (సోమవారం) ఆ ఇంటికి నిర్వహించిన గృహప్రవేశ కార్యక్రమానికి రజనీ హాజరయ్యారు. ఆ సందర్భంగా కలైజ్ఞానం కుటుంబ సభ్యులతో గడిపిన రజనీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రజనీ తీరును పెద్ద ఎత్తున ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వ్యక్తిత్త్వం రజనీకి మాత్రమే సొంతమేమో? ఇండస్ట్రీలో తలైవాకు సాటి మరెవరూ రారేమో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English