'కుక్క' కామెడీ ట్రాక్ ఘోరాతిఘోరం

 'కుక్క' కామెడీ ట్రాక్ ఘోరాతిఘోరం

ఒకప్పుడు తెలుగు సినిమాను చూసి తమిళ జనాలు కామెడీ చేసేవాళ్లు. ఇక్కడ స్టార్ హీరోలందరూ కూడా రొటీన్ మాస్ మసాలా సినిమాలే చేసేవాళ్లు. తమిళంతో పోలిస్తే మన సినిమాలు తక్కువ స్థాయిలోనే ఉండేవి. కానీ గత కొన్నేళ్లలో కథ మారింది. మన సినిమాలు కొత్తదనం వైపు అడుగులేస్తున్నాయి. మన హీరోల కథల ఎంపిక మారింది. ప్రేక్షకుల అభిరుచి కూడా మారి మన సినిమా స్వరూపమే మారిపోయింది. ఇప్పుడు రొడ్డకొట్టుడు సినిమాలు తీస్తే మనోళ్లే కామెడీ చేస్తున్నారు. మన సినిమాల ముందు తమిళ చిత్రాలే తక్కువగా కనిపిస్తున్నాయి. అక్కడి దర్శకులే అప్ డేట్ కావట్లేదనిపిస్తోంది.

ఇలాంటి తరుణంలో తిరు అనే తమిళ దర్శకుడు వచ్చి తెలుగులో ఓ సినిమా తీశాడు. అదే.. చాణక్య. తమిళంలో ‘నాన్ సిగప్పు మనిదన్’ అనే కొత్త తరహా సినిమా తీసిన దర్శకుడితను. అందులో హీరో ఏ విషయానికైనా కొంత ఎమోషనల్ అయితే.. అతడికి నిద్ర వచ్చేస్తుంది.

ఈ లోపాన్ని పెట్టుకుని అతను తన సమస్యల్ని ఎలా ఎదుర్కొన్నాడనే కథతో సినిమా తెరకెక్కింది. ‘ఇంద్రుడు’ పేరుతో తెలుగులో విడుదలైన ఆ చిత్రం ఇక్కడ కూడా ఓ మోస్తరుగా ఆడింది. తిరు తీసిన మిగతా చిత్రాలు కూడా ఓకే అనిపిస్తాయి.

ఐతే తమిళంలో మంచి పేరున్న ఈ దర్శకుడు తెలుగులో మాత్రం 'చాణక్య' అనే రొటీన్ టెంప్లేట్ ఉన్న సినిమా తీశాడు. రా ఏజెంట్లను కలిశా.. అధికారులతో మాట్లాడా.. చాలా అథెంటిగ్గా సినిమా తీశా అని చెప్పేసరికి ప్రేక్షకులు ఏదో అనుకున్నారు. కానీ తెరమీద రొటీన్ బొమ్మ కనిపించింది. తెలుగులో ఇలా కమర్షియల్ టెంప్లేట్లో ఐదారేళ్ల కిందట సినిమాలొచ్చేవి.

ఇక ఇందులో గోపీచంద్-మెహ్రీన్-ఆలీల మీద నడిపిన 'కుక్క' కామెడీ ట్రాక్ అయితే ఘోరాతిఘోరం. తెలుగు ప్రేక్షకుల్ని ఈ దర్శకుడు ఎంత తక్కువగా అంచనా వేశాడో అనిపించేలా సాగిందీ ఎపిసోడ్. ఒక కామెడీ మూవీలో కూడా ఉండజాలని ఈ ఎపిసోడ్‌ను ఒక స్పై థ్రిల్లర్లో పెట్టిన దర్శకుడిని ఏమనాలి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English