సైరా లో బజ్.. లాభమా, శాపమా?

సైరా లో బజ్.. లాభమా, శాపమా?

సైరా నరసింహారెడ్డి ప్రమోషన్లలో ఊపు పెరుగుతుందని.. రిలీజ్ దగ్గర పడేసరికి హైప్ పెంచుతారని అనుకున్నారు. కానీ ఈ సినిమాకు ఆశించినంత హైప్ రాలేదన్నది వాస్తవం. చాలా లేటుగా ప్రమోషన్లు మొదలుపెట్టడం వల్ల ఆశించిన ప్రయోజనం దక్కలేదు. సినిమాకున్న చారిత్రక నేపథ్యం, బడ్జెట్, స్కేల్ పరంగా ఈ చిత్రాన్ని ‘బాహుబలి’తో పోలుస్తున్నారు. కానీ ‘బాహుబలి’ వరకు ఎందుకు? ఈ మధ్యే వచ్చిన ‘సాహో’ స్థాయిలో కూడా ‘సైరా’కు హైప్ లేదన్నది వాస్తవం.

‘సైరా’ టీజర్, ట్రైలర్ బాగున్నప్పటికీ ‘బాహుబలి’, ‘సాహో’ తరహాలో అయితే జనాల్ని ఎగ్జైట్ చేయలేదన్నది వాస్తవం. దీనికి తోడు ప్రమోషన్ల హడావుడి కూడా పెద్దగా లేకపోవడంతో ఈ సినిమాకు ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి.. ఫుల్ రన్లో ఎంత వసూలు చేస్తుంది అన్నదానిపై సందిగ్ధత నెలకొంది.

‘సాహో’ సినిమా విషయంలో చిత్ర బృందం ప్రేక్షకులతో జూదం ఆడిందన్నది వాస్తవం. సినిమాలో ఏదో ఉందనే భ్రమ కలిగించేలా ప్రోమోలు కట్ చేశారు. హైప్ తెచ్చారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిన కూడా ఈ సినిమాకు అనూహ్యమైన హైప్ వచ్చింది. సినిమాకు ఓ రేంజిలో ఓపెనింగ్స్ వచ్చాయి. దీని వల్ల తొలి నాలుగు రోజుల్లో పెట్టుబడిలో 60 శాతం వెనక్కి వచ్చింది. అదంతా ముందు వచ్చిన హైప్‌తో జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ పుణ్యమే. అదే సమయంలో ప్రేక్షకులు సినిమా చూసి ఉస్సూరుమనడంతో నాలుగు రోజుల తర్వాత సినిమా దబేల్‌మని కింద పడింది. ఆ తర్వాత లేవలేదు. కనీస స్థాయిలో కూడా వసూళ్లు లేక సినిమా కుదేలైపోయింది.

ఐతే ‘సైరా’కు ప్రి రిలీజ్ హైప్ విపరీతంగా లేకపోవడం మంచి చేయొచ్చు. అలాగే చెడు కూడా చేయొచ్చు. చిరంజీవి సినిమా కాబట్టి తెలుగు రాష్ట్రాల వరకు ఓపెనింగ్స్‌కు ఢోకా లేకపోవచ్చు. సినిమా అనుకున్నదానికంటే బాగుంటే లాంగ్ రన్ ఉంటుంది. లాంగ్ వీకెండ్, దసరాల సెలవుల అడ్వాంటేజీ ఉండబట్టి మూడు నాలుగు రోజుల ఆరంభ శూరత్వానికి పరిమితం కాకుండా లాంగ్ రన్‌లో మంచి షేర్ రాబట్టవచ్చు. కానీ టాక్ బాలేకుంటే మాత్రం సినిమాకు ఎదురుదెబ్బ తప్పదు. తెలుగు రాష్ట్రాల్లోనూ వసూళ్లపై ప్రభావం ఉంటుంది. ఇతర ఏరియాల్లో గట్టి దెబ్బే తగలొచ్చు. చూద్దాం మరి ఏమవుతుందో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English