కేటీఆర్ ట్వీట్ కాపీ.. కామెడీ అయిన ఏపీ ఎమ్మెల్యే


ఇండియాలో త‌మ కార్ బ్రాండును తీసుకురావ‌డానికి భార‌త ప్ర‌భుత్వంతో ఇబ్బందులున్న‌ట్లుగా ఇటీవ‌ల టెస్లా అధినేత ఎలాన్ మ‌స్క్ చేసిన ట్వీట్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ జ‌వాబు వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. త‌మ రాష్ట్రం పెట్టుబ‌డుల‌కు స్వ‌ర్గ‌ధామ‌మ‌ని, త‌మ‌తో క‌లిస్తే స‌వాళ్ల‌పై క‌లిసి ప‌ని చేసి ప‌రిష్కారం క‌నుగొందామ‌ని కేటీఆర్ ట్వీట్ వేశారు. అస‌లు టెస్లా ఇండియాకు రాక‌పోవ‌డానికి కార‌ణాలేంటో తెలియ‌కుండా చాలామంది సెల‌బ్రెటీలు కేటీఆర్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ టెస్లా అధినేత‌కు ఆహ్వానాలు ప‌లికేశారు.

ఈ విష‌యంలో కేటీఆర్‌కు ఎలివేష‌న్లు ఇచ్చేవాళ్లు ఎలివేష‌న్లు ఇస్తే.. ఇండియాలో కార్లు ఉత్ప‌త్తి చేయ‌కుండా ఆల్రెడీ త‌యారైన కార్ల‌ను ఇండియాకు తీసుకొచ్చి ప‌న్ను భారం లేకుండా అమ్ముదామ‌ని టెస్లా చూస్తున్న వైనాన్ని వెల్ల‌డిస్తూ కేటీఆర్‌ను ట్రోల్ చేసిన వాళ్లూ ఉన్నారు సోష‌ల్ మీడియాలో. ఐతే ఇదేమీ తెలియ‌కుండా కేటీఆర్ ట్వీట్‌ను కాపీ కొట్టి ఇప్పుడో ఆంధ్రప్ర‌దేశ్ అధికార పార్టీ ఎమ్మెల్యే ట్విట్ట‌ర్లో విప‌రీతంగా ట్రోల్ అవుతున్నారు.

అనంత‌పురం జిల్లా క‌దిరి నియోజ‌కవ‌ర్గ ఎమ్మెల్యే పెద‌బ‌ల్లి వెంక‌ట‌సిద్ధారెడ్డి కేటీఆర్ ట్వీట్‌ను కాపీ కొట్టి.. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు ఎలివేష‌న్ ఇస్తూ, త‌మ రాష్ట్ర ఇండ‌స్ట్రియ‌ల్ పాల‌సీ అద్భుత‌మ‌ని పేర్కొంటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టెస్లా ప్లాంటు పెట్టాలంటూ ట్వీట్ వేశారు. ఇలా ట్వీట్ ప‌డిందో లేదో.. అలా నెటిజ‌న్లు ఆయ‌న‌పై తీవ్ర స్థాయిలో దాడి చేశారు.

ఏపీలో ఏం చూసి పెట్టుబ‌డులు పెట్టాలి.. అనంత‌పురంలో కార్ల కంపెనీ పెట్టిన‌ కియాను బెదిరించినందుకా.. ఫ్యాక్ట‌రీ స‌న్నాహాల్లో జాకీ సంస్థ త‌మిళ‌నాడు పారిపోయేలా చేసినందుకా.. అమ‌ర్ రాజా వాళ్ల‌ను ఉక్కిరిబిక్కిరి చేసినందుకా.. అంటూ గ‌త రెండున్న‌రేళ్ల‌లో కొత్త ప‌రిశ్ర‌మ‌లు, పెట్టుబ‌డుల‌కు పూర్తి వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్న జ‌గ‌న్ స‌ర్కారు తీరును ఎండ‌గ‌ట్టేశారు. అలాగే ఏపీలో రోడ్ల ప‌రిస్థితిని గుర్తు చేస్తూ ఈ రోడ్ల మీద టెస్లా కార్లు తిప్ప‌మంటారా అంటూ తీవ్ర స్థాయిలో ఎమ్మెల్యేను దుయ్య‌బ‌ట్టారు. ఎమ్మెల్యే ట్వీట్‌కు మ‌ద్ద‌తుగా ఒక్క‌టంటే ఒక్క ట్వీట్ లేదు. ఒక్క కామెంట్ లేదు. ఈ స్థాయిలో జ‌నాల స్పంద‌న చూశాక తానెందుకు ఈ ట్వీట్ వేశానా అని త‌ల ప‌ట్టుకునే ఉంటారేమో ఆ ఎమ్మెల్యే.