చరణ్‌ను తొక్కుతూ లాక్కెళ్తుంటే చిరు బాధ..

చరణ్‌ను తొక్కుతూ లాక్కెళ్తుంటే చిరు బాధ..

‘గమ్యం’ సినిమా చివర్లో అల్లరి నరేష్ పాత్ర చనిపోతుంటే.. చూసే ప్రతి ప్రేక్షకుడికీ గుండె బరువెక్కుతుంది. అది సినిమా అయినా సరే.. తెలియని భావోద్వేగం వెంటాడుతుంది. ఆ సన్నివేశం చూసి నరేష్ తల్లి అస్సలు తట్టుకోలేకపోయారట. అది నటన అని తెలిసినా సరే.. ఆమెలో దు:ఖం తన్నుకొచ్చేసిందట. ఇక ఎప్పుడూ అలాంటి సన్నివేశాలు చేయొద్దని నరేష్‌కు చెప్పేసిందట. ఆమె మాట ప్రకారం ఇంకెప్పుడూ నరేష్ తెరపై చనిపోయే సన్నివేశంలో నటించలేదు. నటనలో భాగంగా కూడా తమ బిడ్డలు బాధ పడటాన్ని చూసి సినీ జనాలు కూడా చాలామంది తట్టుకోలేరు. ఈ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నాడట. ఇటీవలి కొడుకుకు సంబంధించిన ఓ ఉదంతాన్ని గుర్తు చేసుకుంటూ తనలోని తండ్రి ప్రేమను చాటుకున్నారు చిరు.

తన పుట్టిన రోజు సమయంలో చిరు భార్య సురేఖతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి స్వదేశానికి చేరుకోగానే.. ఇంటికి వెళ్లకుండా రామోజీ ఫిలిం సిటీలో ఉన్న కొడుకు రామ్ చరణ్‌ను చూసేందుకు వెళ్లారట చిరు దంపతులు. ఆ సమయంలో చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణలో పాల్గొంటున్నాడట. ఈ సినిమాలో చరణ్‌ది అల్లూరి సీతారామరాజు పాత్ర అన్న సంగతి తెలిసిందే. అయితే సీతారామరాజు విప్లవ వీరుడిగా పరిణామం చెందడానికి ముందు సన్నివేశాల్లో భాగంగా.. చరణ్‌ను కొడుతూ, తొక్కుతూ, తాళ్లతో కట్టి ఈడ్చుకెళ్తున్న దృశ్యాల్ని రాజమౌళి చిత్రీకరిస్తున్నాడట చిరు వెళ్లే సమయానికి. అది చూసి చిరు తట్టుకోలేకపోయాడట. షూటింగ్ అయినా సరే బాధ పడిపోయాడట.

ఇక సురేఖ అయితే ఆ సీన్ చూసి కన్నీళ్లు పెట్టేసుకుందట. కన్న ప్రేమ విషయంలో ఎవ్వరూ మినహాయింపు కాదు అనడానికిది ఉదాహరణ. మొత్తానికి మాటల సందర్భంలో ‘ఆర్ఆర్ఆర్’లోని ఓ కీలక దృశ్యం గురించి ఇలా రివీల్ చేసేయడం విశేషమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English