రాజ్య‌స‌భ‌కు ఆ ముగ్గురు!

ఈ ఏడాది జూన్‌లో పెద్ద ఎత్తున రాజ్య స‌భ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఏపీకి చెందిన నాలుగు రాజ్య స‌భ ఎంపీల ప‌దవి కూడా ముగుస్తుంది. మార్చిలో దీనికి సంబంధించిన నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యే వీలుంది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో బ‌లం దృష్ట్యా వైసీపీకే ఆ నాలుగు స్థానాలు ద‌క్కుతాయి. ఇప్ప‌టికే వైసీపీ రాజ్య స‌భ ఎంపీగా ఉన్న విజ‌య సాయిరెడ్డిని మ‌రోసారి  కొన‌సాగించ‌డం ఖాయ‌మే. ఇక ఆ మూడు స్థానాల కోసం జ‌గ‌న్ ఎవ‌రిని ఎంపిక చేస్తారోన‌న్న చ‌ర్చ జోరందుకుంది.

వ‌చ్చే జూన్ నాటికి విజ‌య‌సాయిరెడ్డి, సుజ‌నా చౌద‌రి, సురేష్ ప్ర‌భు, టీజీ వెంక‌టేష్ ప‌ద‌వీ కాలం ముగుస్తుంది. వీళ్ల‌లో విజయ సాయిరెడ్డిని జ‌గ‌న్ కొన‌సాగించడంలో సందేహం లేదు. ఇక బీజేపీకి చెందిన ఆ ముగ్గురి స్థానాల్లో కొత్త‌గా జ‌గ‌న్ ఎవ‌రికి అవ‌కాశం ఇస్తార‌నే చ‌ర్చ పార్టీలో మొద‌లైంది. అందులో ఒక‌టి క‌చ్చితంగా బీసీల‌కు ఇవ్వాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ని తెలిసింది. మ‌రొక‌టి ఎస్సీ, ఎస్టీల‌కు కేటాయించాల‌న్న‌ది జ‌గ‌న్ అభిప్రాయంగా ఉంద‌ని స‌మాచారం.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్ల స‌మ‌యం ఉంది కాబ‌ట్టి రాజ్య స‌భ ఎంపీ ప‌ద‌వుల విష‌యంలో ప‌క్కా సామాజిక స‌మీక‌ర‌ణాలు పాటించాల‌నేది జ‌గ‌న్ ఆలోచ‌న‌గా తెలుస్తోంది. అందుకే ఇప్ప‌టి నుంచే ఆ ప‌ద‌వుల‌పై ఆయ‌న క‌స‌ర‌త్తు మొద‌లెట్టిన‌ట్లు టాక్‌. మ‌రోవైపు 2019 ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ కొంద‌రికి రాజ్య‌స‌భ ప‌ద‌వి హామీ ఇచ్చారు. ఇప్పుడు వాళ్లంద‌రూ ప‌ద‌విపై ఆశ‌తో ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఒక‌వేళ సామాజిక స‌మీక‌ర‌ణాల‌ను దృష్టిలో పెట్టుకుని త‌మ‌కు అన్యాయం చేస్తారేమోన‌ని వాళ్లు ఆందోళన చెందుతున్న‌ట్లు తెలుస్తోంది. బీసీలు, ఎస్సీ, మైనారిటీల‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వుల్లో జ‌గ‌న్ ప్రాధాన్య‌త‌నిచ్చారు. వాళ్ల‌కే 50 శాతం స్థానాలు కేటాయించారు. ఈ నేప‌థ్యంలో మిగిలిన మూడు రాజ్య‌స‌భ ప‌ద‌వులు ఈ నేత‌ల‌కే ద‌క్కుతాయ‌నే వార్తలు వ‌స్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి కిల్లి కృపారాణికి ఈ సారి రాజ్య‌స‌భ ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని చెబుతున్నారు. మ‌రోవైపు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇవ్వ‌లేక‌పోయిన మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌ను కూడా జ‌గ‌న్ రాజ్య‌స‌భ‌కు పంపుతార‌ని వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇక కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అంగీక‌రిస్తే ఆయ‌న‌కు కూడా ఓ ప‌దవి ఇచ్చేందుకు జ‌గ‌న్ సుముఖంగా ఉన్నార‌ని విశ్లేష‌కులు అంటున్నారు.