థియేటర్స్‌లోనే ‘బచ్చన్‌ పాండే’

సంవత్సరానికి నాలుగైదు సినిమాలు ఈజీగా చేసేస్తాడు అక్షయ్ కుమార్. పక్కా ప్లానింగ్‌తో, పర్‌‌ఫెక్ట్ షెడ్యూల్స్‌తో సినిమాలు కంప్లీట్ చేయడం అతన్ని చూసే నేర్చుకోవాలి అంటారంతా. కొవిడ్ ఎఫెక్ట్ ఓ రేంజ్‌లో ఉన్నప్పుడు కూడా పని చేయడం ఆపలేదు అక్కీ. తనదైన స్పీడులో ప్రాజెక్టులైతే పూర్తి చేశాడు.కానీ వాటిని రిలీజ్ చేయడం మాత్రం ఎవరి వల్లా కాలేదు. 

మహారాష్ట్రలో థియేటర్లు చాలాకాలం తెరుచుకోకపోవడంతో అక్షయ్ నటించిన చాలా సినిమాలు రిలీజ్‌కి నోచుకోలేదు. దాంతో కొన్నింటిని ఓటీటీల్లో విడుదల చేశారు. పరిస్థితులు చక్కబడ్డాక బెల్ బాటమ్, సూర్యవంశీ, అత్‌రంగీరే చిత్రాలతో మళ్లీ థియేటర్స్‌లో సందడి చేశాడు అక్షయ్. అయితే బచ్చన్‌ పాండే మూవీ మాత్రం రిలీజ్ కోసం నానా తంటాలూ పడింది.

2020 క్రిస్మస్‌కి విడుదలవ్వాల్సిన సినిమా ఇది. 2021 జనవరి 22కి వాయిదా పడింది. సెకెండ్ వేవ్ వల్ల మరోసారి ఆగింది. దాంతో ఇక ఓటీటీ రిలీజ్‌కి ఫిక్సయ్యారనే వార్తలు వచ్చాయి. అది నిజం కాదని ఇప్పుడు తేలింది. బచ్చన్ పాండే చిత్రాన్ని వచ్చే మార్చ్ 18న థియేటర్స్‌లో విడుదల చేయనున్నట్టు ప్రకటన వచ్చింది.

ఫర్హాద్ సామ్‌జీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ సిద్ధార్థ్, బాబీ సింహా నటించిన తమిళ సూపర్‌‌ హిట్ ‘జిగర్తాండ’కి రీమేక్. కృతీ సనన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లు. అర్షద్ వార్శి, పంకజ్ త్రిపాఠి, ప్రతీక్ బబ్బర్, అభిమన్యు సింగ్ కీలక పాత్రల్లో నటించారు. రిలీజ్ డేట్ అయితే ప్రకటించారు కానీ థర్డ్ వేవ్ అంతకంతకూ టెన్షన్ పెడుతోంది కాబట్టి మార్చ్‌లో మూవీ రిలీజవుతుందో లేక మళ్లీ వాయిదా పడుతుందో చూడాలి.