హిందీలోకి వెళ్లిపోతోంది.. మనోళ్లదే ఆలస్యం

హిందీలోకి వెళ్లిపోతోంది.. మనోళ్లదే ఆలస్యం

ఒక టీనేజీ కుర్రాడు అనుకోకుండా ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్తాడు. అతను ఏకంగా 16 ఏళ్ల పాటు కోమాలో ఉండి.. తనతో పాటు చుట్టూ ఉన్న మనుషులు, వాతావరణం పూర్తిగా మారిపోయిన స్థితిలో ఈ ప్రపంచంలోకి వస్తాడు. అప్పుడు చాలా కొత్తగా అనిపించే ప్రస్తుత ప్రపంచంలో అతడికి ప్రతిదీ షాకే.

టీ తాగి 2 రూపాయలిచ్చి చిల్లర ఇవ్వమంటాడు. హీరోయిన్ అక్కడక్కడా చిరిగి ఉన్న ఫ్యాషన్ జీన్ ప్యాంట్ వేస్తే వాటిని కప్పేయబోతాడు. ఈ కాన్సెప్ట్‌తో వినోదం పండిస్తూ తమిళ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన కొత్త సినిమా ‘కోమాలి’. జయం రవి, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రమిది. ప్రదీప్ రంగనాథన్ అనే దర్శకుడు రూపొందించాడు. ఆగస్టు 15న రిలీజై బ్లాక్ బస్టర్ హిట్టయింది ‘కోమాలి’. జయం రవి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా ఇది నిలిచింది.

దీని ట్రైలర్ చూసినపుడే సూపర్ హిట్టవడం గ్యారెంటీ అని అందరూ అభిప్రాయపడ్డారు. అదే జరిగింది. వేరే భాషల్లోకి రీమేక్ చేయడానికి కూడా అనువైన సినిమాలా కనిపించిందిది. దీంతో వెంటనే బాలీవుడ్ వాళ్ల కళ్లు పడిపోయాయి. దక్షిణాది చిత్రాల్ని ఏరి కోరి రీమేక్ చేసే బోనీ కపూర్.. ‘కోమాలి’ హక్కులు కొనేశాడు. తన కొడుకు అర్జున్ కపూర్ హీరోగా హిందీలో ఈ చిత్రాన్ని పునర్నిర్మించబోతున్నాడు.

హీరోయిన్, దర్శకుడు ఎవరన్నది ఇంకా ఖరారవ్వలేదు. తెలుగు, కన్నడ భాషల నుంచి కూడా రీమేక్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అందుకే తెలుగులోకి ‘కోమాలి’ని డబ్ చేసే ప్రయత్నాలు కూడా ఆపేశారట. మరి ఈ సినిమా ఎవరి సొంతమవుతుందో.. మంచి ఫన్ జనరేట్ చేసి హిట్టు కొట్టే అవకాశమున్న ఈ చిత్రంలో ఎవరు హీరోగా నటిస్తారో చూడాలి.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English