20 కోట్ల రేంజి నుంచి ఎక్కడికి పడ్డాడంటే..

20 కోట్ల రేంజి నుంచి ఎక్కడికి పడ్డాడంటే..

సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్‌ల తర్వాత తెలుగులో ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకున్న తమిళ హీరో సూర్యనే. ‘గజిని’ సినిమాతో అతను ఇక్కడ సూపర్ పాపులారిటీ సంపాదించాడు. ఆ తర్వాత వరుసగా అతడి సినిమాలు తెలుగులో రిలీజవడం మొదలైంది. మంచి కంటెంట్ ఉన్న, వైవిధ్యమైన సినిమాలు చేయడం ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసులు గెలిచాడు సూర్య.

దీనికి తోడు అతడి వ్యక్తిత్వం, తెలుగు ప్రేక్షకులపై అతను నిజాయితీగా చూపించే ప్రేమ కూడా పాపులారిటీ పెరగడానికి కారణమైంది. కొన్ని విపత్తులు తలెత్తినపుడు ఉదారంగా అతను విరాళాలు ఇచ్చాడు. తన సినిమాల చిత్రీకరణను పట్టుబట్టి తెలుగు రాష్ట్రాల్లో చేయించేవాడు. ప్రమోషన్లు కూడా శ్రద్ధగా చేసేవాడు. అతడి సినిమాలూ బాగుండటంతో ఒక దశలో రూ.20 కోట్ల వరకు వెళ్లింది అతడి మార్కెట్.

కానీ సినిమాల ఎంపికలో తనకు తిరుగులేదు అనిపించుకున్న సూర్య.. గత కొన్నేళ్లలో వరుసగా రాంగ్ ఛాయిస్‌లతో వెనుకబడిపోయాడు. వరుస ఫ్లాపులు అతడి రేంజిని తగ్గిస్తూ వచ్చాయి. చూస్తుండగానే.. 15 కోట్లు, 10 కోట్లు, 5 కోట్లు.. ఇలా తెలుగులో అతడి మార్కెట్ స్థాయి పడుతూ వచ్చింది. సూర్య చివరి సినిమా ‘ఎన్జీకే’కు తెలుగులో కోటి రూపాయల షేర్ కూడా రాని దుస్థితి.

ఐతే సూర్య ఎంతగానో నమ్మే కేవీ ఆనంద్ అయినా అతడి రాతను మారుస్తాడంటే.. ఇంకా పెద్ద దెబ్బ కొట్టాడు. వీళ్ల కలయికలో వచ్చిన కొత్త సినిమా ‘బందోబస్త్’ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. తమిళంలో కాస్త అటు ఇటుగా మాట్లాడుకుంటున్నారు కానీ.. తెలుగులో మాత్రం ఈ చిత్రానికి చాలా బ్యాడ్ రివ్యూలు వచ్చాయి. మౌత్ టాక్ కూడా అస్సలు బాగా లేదు.

అసలు ఇంతకుముందులా సోషల్ మీడియాలో సూర్య సినిమా గురించి జనాలు మాట్లాడుకోవడమే లేదు. సినిమాకు చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ వచ్చేలా లేవు. టాక్ బ్యాడ్‌గా ఉండటంతో సినిమా పుంజుకునే అవకాశాలే కనిపించడం లేదు. ఈ దెబ్బతో తెలుగులో సూర్య మార్కెట్ దాదాపు జీరో అయిపోయినట్లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English