కళ్యాణ్ రామ్ కెరీర్లోనే అతి పెద్ద రిస్క్

కళ్యాణ్ రామ్ కెరీర్లోనే అతి పెద్ద రిస్క్

కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న సంగతే నిజమైంది. నందమూరి కళ్యాణ్ రామ్ వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో నిలవబోతున్నాడు. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో అతను నటిస్తున్న ‘ఎంత మంచి వాడవురా’ వచ్చే సంక్రాంతి సీజన్లోనే రిలీజ్ కాబోతోంది.

ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను తలపించే టైటిల్‌కు భిన్నంగా ఒక మాస్ పోస్టర్ రిలీజ్ చేస్తూ దాని మీద ‘సంక్రాంతి రిలీజ్’ అని వేసేశారు. కాబట్టి ‘అల వైకుంఠపురములో..’, ‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి భారీ చిత్రాల్ని ‘ఎంత మంచివాడవురా’ ఢీకొట్టడం ఖాయమని తేలిపోయింది. కళ్యాణ్ రామ్ కెరీర్లో కచ్చితంగా ఇది అతి పెద్ద రిస్క్ అని చెప్పొచ్చు. మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలకు పోటీగా ఈ నందమూరి హీరో సినిమా రిలీజవుతుందని అసలు ఊహించలేం.

కాకపోతే సినిమా జానర్, రిలీజవుతున్న సీజన్ మీద నమ్మకంతో కళ్యాణ్ రామ్ ఈ రిస్క్ చేయడానికి రెడీ అయిపోయినట్లున్నాడు. సతీశ్ వేగేశ్న ఫ్యామిలీ చిత్రాలకు పెట్టింది పేరు. రెండేళ్ల కిందట ‘ఖైదీ నంబర్ 150’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి భారీ చిత్రాలకు పోటీగా అతడి సినిమా ‘శతమానం భవతి’ని రిలీజ్ చేశారు. పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే.. ఆ రెండు భారీ చిత్రాల్ని మించి ఇదే ఎక్కువ విజయవంతం అయింది.

సంక్రాంతికి జనాలు ఫ్యామిలీ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ‘శతమానం భవతి’తో పాటు ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘ఎఫ్-2’ సినిమాలు అసాధారణ విజయాన్నందుకోవడమే ఇందుకు రుజువు. కాబట్టే పెద్ద సినిమాలకు పోటీగా ‘ఎంత మంచివాడవురా’ను నిలబెట్టే సాహసం చేస్తున్నారు. ఐతే ‘అల వైకుంఠపురములో..’ సైతం కుటుంబ ప్రేక్షకులకు మంచి ఛాయిసే అయ్యేలా ఉంది కాబట్టి కళ్యాణ్ రామ్ సినిమాను జనాలు ఏమాత్రం పట్టించుకుని నెత్తిన పెట్టుకుంటారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English