హరీష్ శంకర్ వాడకం మామూలుగా లేదుగా

హరీష్ శంకర్ వాడకం మామూలుగా లేదుగా

‘గద్దలకొండ గణేష్’గా పేరు మార్చుకున్న ‘వాల్మీకి’ సినిమా దర్శకుడు హరీష్ శంకర్ కెరీర్‌కు ఎంత కీలకమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ‘దువ్వాడ జగన్నాథం’ నిరాశకు గురి చేశాక అతను ఏడాది పాటు ఖాళీగా ఉండాల్సి వచ్చింది. ఇలాంటి టైంలో సేఫ్‌గా ‘జిగర్ తండ’ను రీమేక్ చేయడానికి పూనుకున్నాడు. ఈ సినిమా ఆడకపోతే హరీష్ కెరీర్ ఇబ్బందికర స్థితికి చేరుకునేదే.

కాబట్టే ఈ సినిమాలో ఏ చిన్న అవకాశాన్నీ విడిచిపెట్టలేదు. క్లాస్‌గా సాగే తమిళ కథను.. ఊర మాస్‌గా మార్చడమే కాక.. దానికి కమర్షియల్ హంగులు చాలానే అద్దాడు. వరుణ్ పాత్రను పూర్తి మాస్‌గా తయారు చేసి, అతడి లుక్, గెటప్, బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్, డైలాగ్ డెలివరీ పూర్తిగా మార్చేసి మాస్‌కు పూనకాలు తెప్పించేలా ఆ పాత్రను తీర్చిదిద్దాడు. ఆ క్యారెక్టరే సినిమాకు ప్రధాన బలమైందిప్పుడు.

హరీష్ అంతటితో ఆగాడా? పూజా హెగ్డేను తీసుకొచ్చి తమిళంలో లేని విధంగా ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ పెట్టాడు. అందులో పూజా గ్లామర్‌ను పూర్తిగా ఉపయోగించుకున్నాడు. ఎల్లువొచ్చి గోదారమ్మ పాటతో రచ్చ లేపాడు. మరోవైపు జర్ర జర్రా అనే పాటలో డింపుల్ హయితితో అందాల విందు చేయించాడు. మరోవైపు సినిమా చివర్లో సుకుమార్, నితిన్‌లతో క్యామియోల్ని కూడా సినిమాకు కొసమెరుపులా భలేగా ఉపయోగించుకున్నాడు. సుక్కులోని లెక్కల మాస్టార్ని బయటికి తెచ్చేలా హరీష్ రాసిన డైలాగులు అతడి చమత్కారానికి నిదర్శనం.

ఇక నితిన్‌తో పవర్ స్టార్ గురించి మాట్లాడించడం ద్వారా థియేటర్ నుంచి కదులుతున్న మెగా అభిమానులు మంచి ఊపుతో బయటికి వెళ్లేలా చేశాడు. మరోవైపు చివర్లో సినిమా గొప్పదనాన్ని చాటి చెప్పేలా ఎమోషనల్ డైలాగులు రాయడం ద్వారా ఇండస్ట్రీ జనాలందరూ ఉద్వేగానికి గురయ్యేలా, ఈ చిత్రాన్ని ఓన్ చేసుకునేలాగా కూడా చేయగలిగాడు. ఇలా ‘వాల్మీకి’ని హిట్ చేయడానికి ఏం చేయాలో అన్నీ చేసిన హరీష్.. అందుకు తగ్గ ఫలితాన్నే అందుకునేలా కనిపిస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English