బాబు.. కాలర్ ఎగరేయొచ్చు

బాబు.. కాలర్ ఎగరేయొచ్చు

కొణిదెల కుటుంబం నుంచి ముందుగా హీరో అయిన చిరంజీవి మెగాస్టార్ అయిపోయాడు. ఆయన చిన్న తమ్ముడు పవర్ స్టార్ అన్నకు దీటుగా ఎదిగాడు. పవర్ స్టార్ అయ్యాడు. కానీ మధ్యలో నాగబాబు మాత్రం ఎటూ కాకుండా పోయాడు. ఆయన కూడా నటుడిగా అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు కానీ.. ఫలితం లేకపోయింది.

హీరోగా 'కౌరవుడు', 'ఆపద మొక్కులవాడు' లాంటి  సినిమాలు చేశాడు కానీ.. ఫలితం లేకపోయింది. నిర్మాతగా కూడా అతను నిలదొక్కుకోలేకపోయాడు. 'ఆరెంజ్' తర్వాత పూర్తిగా జీరో అయిపోయిన నాగబాబు.. తీవ్ర మనోవేదన కూడా అనుభవించినట్లు గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత 'జబర్దస్త్' ప్రోగ్రాంతో పుంజుకుని.. మళ్లీ సినిమాలు దక్కించుకుని నిలదొక్కుకున్నాడు నాగబాబు. ఐతే అన్న, తమ్ముడు ఆ స్థాయికి చేరినా.. తాను ఒక ఫెయిల్యూర్‌గా నిలిచిపోవడం నాగబాబును బాధించే ఉంటుంది.

ఐతే నటుడిగా, హీరోగా నాగబాబు ఎదగలేకపోయినా.. ఇప్పుడు ఆయన వారసుడు తెలుగు సినిమాపై తనదైన ముద్ర వేస్తున్నాడు. అందరు వారసుల్లా మాస్ మంత్రం పఠించకుండా, రొడ్డకొట్టుడు సినిమాలు చేయకుండా.. 'ముకుంద' లాంటి క్లాస్ సినిమాతో మొదలుపెట్టి.. ఆ తర్వాత 'కంచె', 'ఫిదా', 'తొలి ప్రేమ' లాంటి సినిమాలతో తన అభిరుచిని చాటాడు వరుణ్.

నటుడిగా అతడికి మంచి గుర్తింపు వచ్చాక 'ఎఫ్-2' లాంటి కమర్షియల్ మూవీ చేశాడు. అది సూపర్ హిట్టయింది. ఇప్పుడు తనే ప్రధాన పాత్ర పోషిస్తూ 'వాల్మీకి' లాంటి మాంచి మాస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

మాస్ సినిమా అంటే మరీ రొటీనేమీ కాదు. ఈ కథ చాలా వైవిధ్యంగా ఉంటుంది. పైగా తమిళంలో బాబీ సింహా చేసిన విలన్ పాత్రను చేశాడు వరుణ్. అతను చేసిన ఈ సాహసానికి అద్భుతమైన స్పందన వస్తోంది. 'వాల్మీకి'కి వరుణే అతి పెద్ద ఆకర్షణగా నిలిచాడు. బాబీ సింహాను మ్యాచ్ చేయడం ఇంకెవరికీ సాధ్యం కాదనుకుంటే.. అతను అసలు తలపుల్లోకే రాని విధంగా పూర్తి భిన్నంగా ఈ పాత్రను పోషించి మెప్పించాడు వరుణ్.

తాను స్క్రీన్ మీద కనిపిస్తే చూపు తిప్పుకోలేని స్క్రీన్ ప్రెజెన్స్‌తో వరుణ్ కట్టిపడేశాడు. నటుడిగా అతడి కెరీర్లో ఇది మరుపు రాని పాత్రే. సినిమా రిలీజైనప్పటి నుంచి అందరూ వరుణ్ గురించే మాట్లాడుకుంటున్నారు. అతడినో ఆణిముత్యంగా పేర్కొంటున్నారు. ఈ ప్రశంసలతో నాగబాబు ఎంతగా మురిసిపోతుంటారో చెప్పేదేముంది? అందుకేనేమో నిన్న సాయంత్రం పెట్టిన సక్సెస్ ప్రెస్ మీట్‌కు హాజరై తన సంతోషాన్ని పంచుకున్నాడు నాగబాబు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English