ఆ రెండు జిల్లాల్లో ‘వాల్మీకి’ రిలీజ్ కావట్లేదు

ఆ రెండు జిల్లాల్లో ‘వాల్మీకి’ రిలీజ్ కావట్లేదు

ఇంకొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ‘వాల్మీకి’ చిత్రానికి షాక్ తగిలింది. ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని రెండు జిల్లాల్లో రిలీజ్ కానివ్వకుండా ఆదేశాలు వచ్చాయి. రాయలసీమలో పెద్ద జిల్లాలైన అనంతపురం, కర్నూలుల్లో ఈ సినిమా శుక్రవారం విడుదల కావట్లేదు. ఈ సినిమాను థియేటర్లలో ప్రదర్శించొద్దంటూ ఆ జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ఈ చిత్రానికి వాల్మీకి అనే టైటిల్ పెట్టడాన్ని వాల్మీకి సంఘం మొదట్నుంచి వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. కమర్షియల్ ఎలిమెంట్లతో తీసిన మాస్ సినిమాకు ‘వాల్మీకి’ అనే టైటిల్ పెట్టడాన్ని వాళ్లు అభ్యంతరపెడుతున్నారు. ఇది తమ కులాన్ని కించపరచడమే అంటున్నారు. పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు కూడా జరిగాయి.

వాల్మీకి సంఘాల అభ్యంతరాల మేరకే సినిమా ప్రదర్శనను ఆపివేస్తున్నట్లు జీవోల్లో పేర్కొన్నారు. ఐతే ఒక దొంగగా ఉన్న వాల్మీకి రామాయణాన్ని రాసిన మహా రచయితగా ఎదిగిన వైనాన్ని స్ఫూర్తిగా తీసుకుని.. రాక్షసుడిగా ఉన్న వ్యక్తి ఎలా మంచివాడిగా పరిణామం చెందాడనే కథాంశంతో తెరకెక్కిన సినిమాకు ‘వాల్మీకి’ అనే టైటిల్ పెట్టామని.. ఇది వాల్మీకి గౌరవాన్ని పెంచేదే తప్ప తగ్గించేది కాదని.. ఎవ్వరూ హర్ట్ కావాల్సిన పని లేదని దర్శకుడు హరీష్ శంకర్ చెబుతూ వస్తున్నాడు.

ఐతే విడుదలకు కొన్ని రోజుల ముందు సినిమా ప్రదర్శన ఆపాలని ఆదేశాలు వస్తే.. ఆందోళనకారులతో రాజీ కుదుర్చుకోవడమో.. సమస్యను ఎలాగోలా పరిష్కరించుకోవడమో చేసేవాళ్లు. కానీ ఇంకొన్ని గంటల్లో విడుదల అనగా ఇలా బ్రేక్ వేస్తే ఏం చేయాలో పాలుపోని పరిస్థితి తలెత్తుతుంది. ఈ రెండు జిల్లాల్లో సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు అన్యాయం అయిపోతారు. వాళ్లు చేతులెత్తేస్తే నిర్మాతలకు నష్టం వాటిల్లుతుంది. మరి ఈ సమస్యను ఎలా పరిష్కరించి.. ఎంత త్వరగా సినిమా విడుదలకు అనుమతి వచ్చేలా చూస్తారో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English