చేస్తే చరణ్ చేయాలి.. లేదంటే నేనే

చేస్తే చరణ్ చేయాలి.. లేదంటే నేనే

టాలీవుడ్లో ఇప్పటికే ఇద్దరు ప్రముఖ వ్యక్తుల బయోపిక్స్ చూశాం. సావిత్రితో పాటు ఎన్టీఆర్ మీద సినిమాలు తీశారు. మధ్యలో ఏఎన్నార్ బయోపిక్ గురించి కూడా చర్చ జరిగింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. అది తెరకెక్కే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఇప్పుడిక మరో టాలీవుడ్ లెజెండ్ బయోపిక్ గురించి చర్చ మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి జీవిత కథ ఆధారంగా సినిమా తీస్తే బాగుంటుందని అంటున్నాడు ఆయన కుటుంబానికే చెందిన వరుణ్ తేజ్.

చిరు బయోపిక్ ఆయన తనయుడు రామ్ చరణ్ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడిన వరుణ్.. తన అన్న చేయకపోతే ఆ సినిమా తాను చేస్తానని ప్రకటించడం విశేషం. ‘వాల్మీకి’ చిత్రీకరణ సందర్భంగా హరీష్ శంకర్ సైతం చిరు బయోపిక్ గురించి తనతో చర్చించాడని.. తనకు ఆ సినిమా తీయాలని ఉందని చెప్పాడని వరుణ్ తెలిపాడు. మరి చరణ్‌తో ఈ సినిమా గురించి వరుణ్ మాట్లాడి, అతను కాదంటే హరీష్ దర్శకత్వంలో చిరు బయోపిక్ తానే చేస్తాడేమో చూడాలి.

ఇదిలా ఉంటే హరీష్ శంకర్ ‘డీజే’ తర్వాత చేస్తాడనుకున్న ‘దాగుడుమూతలు’లో ఇద్దరు హీరోల్లో ఒకరి కోసం తననే సంప్రదించినట్లు వరుణ్ తెలిపాడు. ‘ఫిదా’, ‘తొలి ప్రేమ’ చిత్రాల తర్వాత వరుసగా అందరూ తనను ప్రేమకథలతోనే సంప్రదించారని.. హరీష్ శంకర్ సైతం ‘దాగుడుమూతలు’ అనే ప్రేమకథతోనే తనను కలిశాడని.. ఐతే తాను మాత్రం హరీష్ స్టయిల్లోనే సినిమా చేయాలనుకున్నానని.. అప్పుడే అతను తమిళ హిట్ మూవీ ‘జిగర్ తండ’ గురించి చెప్పాడని.. ఇందులో నెగెటివ్ రోల్ చేయడం పట్ల చాలామంది వారించిన సమయంలో చిరు దగ్గరికెళ్లి కథ, పాత్ర గురించి చెబితే హీరోనా, విలనా అని చూడకుండా ఆ సినిమా చేయమని చెప్పడంతో ధైర్యంగా ‘వాల్మీకి’లో నటించానని చెప్పాడు వరుణ్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English