నాని మాట ఇచ్చాడు.. నిలబెట్టుకుంటున్నాడు

నాని మాట ఇచ్చాడు.. నిలబెట్టుకుంటున్నాడు

సినిమాల ప్రమోషన్లలో చాలా కబుర్లు వినిపిస్తుంటాయి. కొత్త కాంబినేషన్లు తెరపైకి వస్తుంటాయి. కానీ సినిమా అనుకున్న మేర ఆడనపుడు అవి పక్కకు వెళ్లిపోతుంటాయి. ఎవరికి వాళ్లు సైలెంట్ అయిపోతుంటారు. టాలీవుడ్లో ఇలాంటి అనుభవాలు చాలానే ఉన్నాయి. ఆ మధ్య ‘ఫలక్‌నుమా దాస్’ అనే చిన్న సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన నేచురల్ స్టార్ నాని.. ఈ చిత్ర కథానాయకుడు, దర్శకుడు విశ్వక్సేన్‌తో తాను ఓ సినిమా నిర్మిస్తానని అన్న సంగతి గుర్తుండే ఉంటుంది.

‘ఫలక్‌నుమా దాస్’కు విడుదలకు ముందు మంచి హైప్ రావడం, సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద సంస్త దీంతో అసోసియేట్ కావడంతో నాని ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చాడు. తాను విశ్వక్‌తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు.

ఐతే ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాది ఆరంభ శూరత్వమే అయింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ మాత్రమే తెచ్చుకుంది. ఆ సినిమా ప్రమోషన్లలో విశ్వక్ చేసిన అతి విమర్శల పాలైంది. దీంతో విశ్వక్‌తో సినిమా తీయాలనుకునేవాళ్లు కూడా వెనుకంజ వేస్తారేమో అనిపించింది. ‘ఫలక్‌నుమా దాస్’ రిలీజైన తర్వాత నాని-విశ్వక్ కాంబినేషన్ గురించి ఊసే లేకపోవడంతో ఈ సినిమా ఉండదనే అనుకున్నారంతా. కానీ ఈ చిత్రం నిజంగానే పట్టాలెక్కబోతోందట.

ఇంకో రెండు నెలల్లో ఈ చిత్రాన్ని మొదలుపెడతారట. ఈ చిత్రానికి విశ్వకే దర్శకత్వం వహించనున్నాడు. ఇంతకుముందు అతను అన్న ‘ఫలక్‌నుమాదాస్-2’నే ఈ చిత్రమా అన్నది తెలియాల్సి ఉంది. నాని ఇంతకుముందు నిర్మాతగా ‘అ!’ సినిమా తీసిన సంగతి తెలిసిందే. దాని తర్వాత అతను నిర్మించే చిత్రమిదే. ప్రస్తుతం విశ్వక్ ఓ కొత్త దర్శకుడితో ‘పాగల్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ముగింపు దశలో నానితో సినిమాను పట్టాలెక్కిస్తాడట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English