తమిళ సైరా కోసం లెజెండ్ దిగాడు

తమిళ సైరా కోసం లెజెండ్ దిగాడు

సైరా నరసింహారెడ్డిని దేశవ్యాప్తంగా బాహుబలి, సాహో చిత్రాల మాదిరి భారీగా రిలీజ్ చేయాలన్నది నిర్మాత రామ్ చరణ్ ఆలోచన. ఈ విషయంలో గట్టి ప్రణాళికతోనే రంగంలోకి దిగినట్లున్నాడు చరణ్. హిందీలో చిరు సినిమాను కొనడానికి పేరున్న నిర్మాతలు ముందుకు రారనే అనుకున్నారంతా. కానీ ఫర్హాన్ అక్తర్, అనిల్ తడాని లాంటి పెద్ద నిర్మాతలతో డీల్ సెట్ చేశాడు. వాళ్లు సైరాను పెద్ద స్థాయిలోనే రిలీజ్ చేసే ప్రణాళికల్లో ఉన్నారు.

వార్ లాంటి క్రేజీ మూవీ రేసులో ఉన్నప్పటికీ హిందీలో ఈ చిత్రం దాదాపు 2 వేల స్క్రీన్లలో రిలీజ్ కాబోతుండటం విశేషం. ఇక సైరా కర్ణాటక హక్కుల్ని కూడా పేరున్న డిస్ట్రిబ్యూటర్లకే కట్టబెట్టాడు చరణ్. ఇప్పుడు తమిళంలో సైరా విడుదల కోసం ఒక లెజెండ్ రంగంలోకి దిగాడు. ఆయనే.. ఆర్.బి.చౌదరి.

సూపర్ గుడ్ ఫిలిమ్స్ బేనర్లో ఒకప్పుడు ఎన్నో పెద్ద సినిమాలు తీసిన నిర్మాత ఆర్.బి.చౌదరి.  అప్పట్లో సౌత్ ఇండియాలో  బేనర్ నంబర్ వన్‌గా ఉండేది. కుటుంబ కథా చిత్రాలతో భారీ విజయాలందుకున్నారాయన. కానీ తర్వాత ట్రెండుకు తగ్గట్లుగా సినిమాలు తీయలేక వరుసగా పరాజయాలు అందుకుని ప్రొడక్షన్ తగ్గించేశారు. ఇప్పుడాయన సైరా చిత్రాన్ని టేకప్ చేయడం విశేషం.

ఒక లెజెండరీ మూవీ తన బేనర్ నుంచి రాబోతోందంటూ రెండు రోజులుగా ఊరించి.. తర్వాత సైరా గురించి ప్రకటన చేశాడాయన. సినిమాల నిర్మాణం తగ్గి ఉండొచ్చు కానీ.. కోలీవుడ్లో చౌదరికి మంచి పట్టుంది. ఆయన చేతికి వెళ్లిందంటే సైరా భారీ స్థాయిలోనే  విడుదల కాబోతున్నట్లే. చిరుకు తమిళంలో మార్కెట్ లేకపోయినా.. విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా, సుదీప్ లాంటి వాళ్లు ఉన్నారు కాబట్టి  కొంత క్రేజ్ ఉంటుంది. చౌదరి రిలీజ్ చేస్తే సినిమాకు ఇంకాస్త క్రేజ్ వస్తుంది. సినిమాకు టాక్ బాగుంటే ఫలితం కూడా  ఆశాజనకంగానే ఉండే అవకాశాలున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English