ఇటు మహేష్.. అటు కమల్.. ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

ఇటు మహేష్.. అటు కమల్.. ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

ఒక సినిమా పూర్తి కాకుండా ఇంకో సినిమా మొదలుపెట్టనని అంటుంటాడు సౌత్ ఇండియన్ టాప్ కెమెరామన్ రత్నవేలు. ఈ విషయంలో రాజీ పడకపోవడం వల్ల కొన్ని మెగా ప్రాజెక్టుల్ని కూడా కోల్పోయినట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. కానీ ఈ పద్ధతిని ఇప్పుడు పక్కన పెట్టేసినట్లుగా అనిపిస్తోంది. రత్నవేలు ప్రస్తుతం మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ చేస్తున్న సంగతి తెలిసిందే. మూణ్నాలుగు నెలలుగా ఆ సినిమా చిత్రీకరణ సాగుతోంది.

దీని తర్వాత సుకుమార్-బన్నీ చేయాలనుకున్నాడు  కానీ.. ఈలోపు భారతీయుడు-2 తెరపైకి వచ్చింది. కమల్ హాసన్, శంకర్‌ల ప్రతిష్టాత్మక కలయికలో సినిమా అనేసరికి తన ఫేవరెట్ డైరెక్టర్ సుక్కు సినిమాను కూడా వదులుకుని అది చేయడానికి అంగీకరించాడు. నిజానికి ఆ సినిమా ఈపాటికి పూర్తి కావాల్సింది. అది అనుకున్నట్లుగా ముందుకు సాగితే.. ‘సరిలేరు నీకెవ్వరు’ చేసేవాడే కాదు రత్నవేలు.

కానీ ‘భారతీయుడు-2’కు బ్రేక్ పడేసరికి ‘సరిలేరు నీకెవ్వరు’ ఒప్పుకున్నాడు. ఇది పూర్తి కాకముందే ‘భారతీయుడు-2’ పున:ప్రారంభమైంది. ఐతే  ఈ రెండు సినిమాల షెడ్యూళ్లకు క్లాష్ అవుతున్నా సరే.. రత్నవేలు దేన్నీ వదులుకోకుండా మేనేజ్ చేస్తుండటం విశేషం. కొన్ని రోజులుగా కర్నూలు కొండారెడ్డి బురుజు సెట్లో మహేష్ సినిమా ఇంట్వర్వెల్ బ్లాక్ చిత్రీకరణ సాగింది. అదే సమయంలో భారతీయుడు-2 చిత్రీకరణ కూడా జరిగింది.

మరి ఒకే సమయంలో రెండు భారీ చిత్రాల షూటింగ్‌ను రత్నవేలు ఎలా మేనేజ్ చేశాడన్నది ఆసక్తికరం. భారతీయుడు-2కు సంబంధించి చిన్న చిన్న సన్నివేశాలే కావడంతో రత్నవేలు పూర్తి స్థాయిలో పని చేయట్లేదని.. అప్పుడప్పుడూ వెళ్తూ అసిస్టెంట్లతో మేనేజ్ చేస్తున్నాడని.. అలాగే రత్నవేలు కోసమే రెండు సినిమాల షెడ్యూళ్లను కాస్త అటు ఇటుగా సర్దుబాటు చేసుకుంటున్నారని.. సరిలేరు నీకెవ్వరు చిత్రీకరణ అక్టోబరుకు పూర్తవుతుంది కాబట్టి ఆ తర్వాత భారతీయుడు-2 షూటింగ్ ఊపందుకోవచ్చని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English