పాటల విషయంలో జక్కన్న కూడా రాజీయేనా?

పాటల విషయంలో జక్కన్న కూడా రాజీయేనా?

ఇండియన్ సినిమా స్థాయి ఇప్పుడు చాలా పెరిగింది. ప్రపంచ స్థాయిలో పెద్ద ఎత్తున మన చిత్రాలు రిలీజవుతున్నాయి. విదేశాల్లో భారీ వసూళ్లు రాబడుతున్నాయి. ఐతే వరల్డ్ సినిమాలో పాటల కాన్సెప్ట్ అన్నదే ఉండదు. సినిమాల మధ్యలో పాటలేంటి అని వాళ్లు ఆశ్చర్యపోతారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇండియాలో తెరకెక్కుతున్న భారీ చిత్రాల్లో నెమ్మదిగా పాటలకు ప్రాధాన్యం తగ్గించేస్తున్నారు.

పెద్ద కథలు చెప్పేటపుడు పాటల వల్ల నిడివి పెరుగుతుండటం కూడా ఫిలిం మేకర్స్ ఇలా ఆలోచించడానికి కారణం. శంకర్-రజనీకాంత్ కలయికలో తెరకెక్కిన ‘2.0’లో కేవలం రెండే పాటలున్న సంగతి తెలిసిందే. అందులోనూ ఒకటి సినిమాలో కాకుండా చివర్లో పెట్టారు. ఈ విషయంలో ప్రేక్షకులు పెదవి విరిచినా చిత్ర బృందం పట్టించుకోలేదు.

ఇక తెలుగులో త్వరలో విడుదల కానున్న భారీ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’లోనూ రెండే రెండు పాటలుంటాయని.. ఒక బ్యాగ్రౌండ్ సాంగ్ మాంటేజ్‌లా వస్తుందని దర్శకుడు సురేందర్ రెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదే బాటలో రాజమౌళి కూడా నడుస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలయికలో ఆయన తీస్తున్న‘ఆర్ఆర్ఆర్’లో కేవలం మూడు పాటలే పెడుతున్నాడట జక్కన్న.

అల్లూరి సీతారామరాజు, కొమరం భీంల కథల్ని కలిపి చెప్పాల్సిన నేపథ్యంలో నిడివి చాలా ఎక్కువ అవుతుందని.. పైగా ఈ చిత్రాన్ని ‘బాహుబలి’కి దీటుగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్న నేపథ్యంలో పాటలకు ప్రాధాన్యం తగ్గిస్తే మంచిదని భావించాడట జక్కన్న. ఈ పాటలు కూడా సందర్భానుసారమే వస్తాయని.. ఎప్పట్లా డ్రీమ్ సాంగ్స్, డ్యూయెట్లు ఉండవని సమాచారం. కీరవాణి ఇప్పటికే ట్యూన్స్ రెడీ చేశాడని.. త్వరలోనే రికార్డింగ్ కూడా మొదలవుతుందని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English