ఇదేదో ‘ఆరెంజ్’ సినిమాలా ఉందే..

ఇదేదో ‘ఆరెంజ్’ సినిమాలా ఉందే..

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. చాలా తక్కువ కాలంలో స్టార్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. అతడి కెరీర్లో పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, ట్యాక్సీవాలా లాంటి సెన్సేషనల్ హిట్లున్నాయి. ఐతే మధ్య మధ్యలో ‘ద్వారక’, ‘నోటా’, ‘డియర్ కామ్రేడ్’ లాంటి డిజాస్టర్లు కూడా తగిలాయి.

ముఖ్యంగా అతను ఎంతో నమ్మి చేసిన ‘డియర్ కామ్రేడ్’ ఫ్లాప్ కావడంతో విజయ్‌ను బాగా నిరాశ పరిచింది. ఈ సినిమా తర్వాత విజయ్ ఆశలన్నీ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం మీదే ఉన్నాయి. చాన్నాళ్లుగా మేకింగ్‌లో ఉన్న ఈ చిత్రం గురించి ఏ విశేషాలూ బయటికి రాలేదు ఇప్పటివరకూ. ఎట్టకేలకు ఈ సినిమా టైటిల్ ప్రకటించారు. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే టైటిల్ ఖరారు చేశాడు క్రాంతిమాధవ్ ఈ చిత్రానికి.

తెలుగు సినిమాలకు ఇంగ్లిష్ టైటిళ్లు పెట్టడం మామూలే. కానీ ఎక్కువగా ఒక్క పదంలో టైటిల్ తేల్చేస్తుంటారు. కానీ మూడు పదాల ఇంగ్లిష్ టైటిల్ పెట్టడం అరుదు. జనాలకు మరీ క్యాచీగా అనిపించే టైటిల్ లాగా ఏమీ లేదు ఇది. తెలుగుదనాన్ని ఇష్టపడే క్రాంతి మాధవ్ ఇలాంటి టైటిల్ ఎందుకు పెట్టాడో మరి. ఐతే ఈ టైటిల్.. ఈ సినిమా కాన్సెప్ట్ గురించి జరుగుతన్న ప్రచారం.. ఇందులో ఏకంగా నలుగురు హీరోయిన్లను పెట్టడం చూస్తుంటే.. రామ్ చరణ్ నటించిన ‘ఆరెంజ్’ చిత్రం గుర్తుకొస్తోంది.

‘వరల్డ్ ఫేమస్ లవర్’ విజయ్ నిజమైన ప్రేమ కోసం వెతికే కుర్రాడిగా కనిపిస్తాడట. అతడి ప్రేమలోని విభిన్న కోణాల్ని చూపిస్తారట ఇందులో. ‘ఆరెంజ్’లో చరణ్ పాత్ర ఎలా సాగుతుందో గుర్తుండే ఉంటుంది. ప్రపంచంలోనే బెస్ట్ లవర్‌గా తనను తాను పరిచయం చేసుకుంటూ ఉంటాడు చరణ్ అందులో. ఇక్కడ తాను విజయ్ వరల్డ్ ఫేమస్ అవర్ అంటున్నాడు. ఐతే ప్రేమకథల్లో మరీ లోతుకు వెళ్లి విషయాల్ని చర్చిస్తే ఏమవుతుందో ‘ఆరెంజ్’లో చూశాం కాబట్టి.. క్రాంతి మాధవ్ మరీ అంత డీప్‌గా వెళ్లకుండా సినిమాను వినోదాత్మకంగా నడిపించి ఉంటాడని ఆశిద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English