ప్రొడ్యూసర్ రామ్‌చరణ్.. ఇందులో పూర్తిగా ఫెయిల్

ప్రొడ్యూసర్ రామ్‌చరణ్.. ఇందులో పూర్తిగా ఫెయిల్

‘సైరా నరసింహారెడ్డి’ని పాన్ ఇండియా మూవీగా చేయాలన్నది రామ్ చరణ్, సురేందర్ రెడ్డిల సంకల్పం. ఇందుకోసమే బాలీవుడ్ నుంచి మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను తీసుకున్నారు. తమిళం నుంచి విజయ్ సేతుపతి, నయనతారలను ఎంచుకున్నారు. కన్నడ నుంచి కిచ్చా సుదీప్‌ను పట్టుకొచ్చారు. ఇంకా మ్యూజిక్ కంపోజర్లుగా కూడా బాలీవుడ్ వాళ్లనే పెట్టుకున్నారు. ఇంకా వివిధ భాషల నుంచి మరిందరు టెక్నీషియన్లను పట్టుకొచ్చారు.

ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ.. సినిమా విడుదలకు ముందు ప్రమోషన్ల ప్లానింగ్‌లో మాత్రం రామ్ చరణ్ బృందం పూర్తిగా తేలిపోతోందనే చెప్పాలి. ‘బాహుబలి’ని, ‘సాహో’ను ఉత్తరాదిన ఎలా ప్రమోట్ చేసి.. ఆ చిత్రాలకు హైప్ తీసుకొచ్చారో వీళ్లకు అర్థం కాకపోవడం విచారించాల్సిన విషయం.

చిరంజీవి మనకు మెగాస్టారే కానీ.. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక దాటితే.. వేరే రాష్ట్రాల్లో ఆయన కోసం ప్రేక్షకులు ఎగబడిపోరు. వేరే రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటే సరిపోదు. అక్కడి ప్రేక్షకుల్లో సినిమా పట్ల ఆసక్తిని పెంచాలి. అందుకోసం ముందు నుంచి ప్రమోషనల్ స్ట్రాటజీని అమలు చేయాలి.

తరచుగా ఏదో ఒక విశేషాన్ని పంచుకోవడం.. విడుదలకు చాన్నాళ్ల ముందే టీజర్, ట్రైలర్, మేకింగ్ వీడియోలు, పాటలు రిలీజ్ చేయడం చాలా అవసరం. కానీ సినిమా విడుదలకు ముందు నెలా రెండు నెలల్లో కేవలం ఒక టీజర్ మాత్రమే రిలీజ్ చేశారు. దానికి ముందు, వెనుక ఏ విశేషాలు లేవు.

రిలీజ్‌కు రెండు వారాల ముందు కూడా ఆడియో ఊసు లేదు. ఉన్న రెండు మూడు పాటల్లో ఒకటైనా ముందు రిలీజ్ చేయాల్సింది. ప్రి రిలీజ్ ఈవెంట్‌ను ఒకటికి రెండుసార్లు వాయిదా వేశారు. ఈ కార్యక్రమం మరీ లేటుగా చేస్తున్నారు. ట్రైలర్ కూడా ఈపాటికే లాంచ్ చేయాల్సింది.

చిరు ఏమీ ప్రభాస్ లాగా ‘బాహుబలి’ చేసి ఉత్తరాదిన సూపర్ పాపులర్ అయిపోలేదు. ఎఫ్పుడో 90ల్లో హిందీలో ఒకట్రెండు సినిమాలు చేశాడంతే. ఈ తరం ప్రేక్షకులకు ఆయనెవరో తెలియదు. అలాంటపుడు హిందీలో వరుసబెట్టి కొన్ని ప్రోమోలు వదిలి.. ప్రమోషన్లు గట్టిగా చేసి అక్కడి జనాల్లో సినిమా పట్ల హైప్ పెంచాల్సింది.

కానీ చరణ్ టీం ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటోంది. తమిళనాడు, కేరళల్లో కూడా ‘సైరా’కు ఏమాత్రం క్రేజ్ ఉంది అన్నది సందేహమే. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక ఆవల ఏమాత్రం ఓపెనింగ్స్ వస్తాయన్నది అనుమానంగా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English