ఈగ విలన్.. చిరు గురించి అంత మాటనేశాడేంటి?

ఈగ విలన్.. చిరు గురించి అంత మాటనేశాడేంటి?

మెగాస్టార్ చిరంజీవితో కలిసి పని చేసిన ఒక నటుడిని.. ఆయన్నుంచి మీరేం నేర్చుకున్నారు అంటే సినిమాల పరంగా చెప్పడానికి చాలా విశేషాలే ఉంటాయి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి తన కష్టంతో, నిబద్ధతతో మెగాస్టార్‌గా ఎదిగిన చిరు నుంచి స్ఫూర్తిగా తీసుకోవడానికి ఎన్నో విషయాలున్నాయి. కానీ ఆయనకు చేదు అనుభవం మిగిల్చిన రాజకీయాల గురించి ప్రస్తావించి.. ‘చిరును చూసి రాజకీయాల్లోకి వెళ్లొద్దని నిర్ణయించుకున్నా’ అని ఒక నటుడు అన్నాడంటే ఆ మాట మెగా అభిమానులకు ఇబ్బంది పెట్టే విషయమే.

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఇదే మాట అనడం ఆశ్చర్యం కలిగించే విషయం. చిరుతో కలిసి ‘సైరా నరసింహారెడ్డి’లో స్క్రీన్ షేర్ చేసుకున్న సుదీప్.. ఆ సినిమా కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాడు. ఈలోపు ‘పహిల్వాన్’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన సుదీప్.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాజకీయాల్లో చిరు వైఫల్యం గురించి పరోక్ష వ్యాఖ్యలు చేశాడు.

చిరుతో కలిసి ‘సైరా’లో నటించారు కదా.. ఆయన నుంచి మీరేం నేర్చుకున్నారు అంటే.. రాజకీయాల ప్రస్తావన తెచ్చాడు సుదీప్. ‘‘ఆయన్ని చూసి రాజకీయాల్లోకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదని నిర్ణయించుకున్నా. మన జీవితంలోంచి విలువైన పది సంవత్సరాలు ఇచ్చేయకూడదని తెలుసుకున్నా. నాకు కూడా రాజకీయ పార్టీల నుంచి ఆహ్వానాలు అందాయి. కానీ నేను తిరస్కరించా. రాజకీయాల్లో చేరితో ఫలానా పార్టీ వ్యక్తి అని ముద్ర వేసి.. మన పరిధిని కుదించేస్తారు. కానీ సినిమా నటుడిగా ఆ పరిమితులేమీ ఉండవు. అందరూ మనవాళ్లే. అందరికీ మనం సొంతవాళ్లమే. ఈ గుర్తింపు దూరం కావాలని నేను కోరుకోవట్లేదు. అందుకే రాజకీయాల్లోకి రాను, రాబోను’’ అని తేల్చి చెప్పేశాడు సుదీప్.

అయితే రాజకీయాల గురించి అడిగినపుడు అతను తన అభిప్రాయం చెప్పాల్సింది కానీ.. చిరును చూసి రాజకీయాల్లోకి రావొద్దని నిర్ణయించుకున్నా అన్నాడంటే.. ఆయన ఆ రంగంలో పెద్ద ఫెయిల్యూర్ అని గుర్తు చేస్తున్నట్లే కదా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English