చిరును అలా చూసి తట్టుకోగలరా?

చిరును అలా చూసి తట్టుకోగలరా?

తెలుగు సినిమాల్లో విషాదాాంతాలు చాలా అరుదు. స్టార్ హీరోల సినిమాల్లో అయితే ట్రాజిక్ ఎండ్స్ దాదాపుగా ఉండవు. హీరోలు చనిపోతే అభిమానులు అస్సలు తట్టుకోలేరు. అలాంటి సినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. అందుకే ఫిలిం మేకర్స్ ఆ తరహాలో సినిమాను ముగించడానికి అస్సలు ఇష్టపడరు. మెగాస్టార్ చిరంజీవి విషయంలో అయితే మరీ పట్టుదలగా ఉంటారు.

చిరు సినిమాలో చచ్చిపోవడాన్ని అభిమానులు అస్సలు తట్టుకోలేరు. ఆయన హీరోగా ‘ఠాగూర్’ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. దీని తమిళ మాతృక ‘రమణ’లో హీరోను ఉరి తీస్తారు. కానీ తెలుగులోకి వచ్చేసరికి ముగింపును మార్చేశారు. హీరోను స్వేచ్ఛగా వదిలేశారు. చిరు మెగాస్టార్ ఇమేజ్ తెచ్చుకున్నప్పటి నుంచి ఇంతే. చిరు పాత్రను చంపడం దాదాపు కనిపించదు.

ఐతే చిరు కొత్త సినిమా ‘సైరా నరసింహారెడ్డి’లో మాత్రం క్లైమాక్స్‌ అభిమానులు కోరుకున్నట్లుగా ఉంచడానికి వీల్లేదు. ఇది నిజ జీవిత గాథ. ఉయ్యాలవాడను చిన్న వయసులోనే బ్రిటిష్ సైన్యం మట్టుపెట్టింది. ఆయన్ని చంపేశాక.. తల తీసి ఒక కోట గుమ్మానికి కొన్ని నెలల పాటు వేలాడదీసింది. తమను ఎదిరించే సాహసం ఇంకెవరూ చేయకూడదనే హెచ్చరిక జారీ చేయడం కోసం ఇలా చేశారు.

ఇక ఉయ్యాలవాడ అభిమానులు.. ఆయన మొండి దేహాన్ని తీసుకెళ్లి నెల రోజుల పాటు అలా ఉంచి.. ఆ తర్వాత ఖననం చేసినట్లుగా చెబుతారు. సినిమాలో ఇవన్నీ చూపిస్తారో లేదో కానీ.. చిరును చంపినట్లు అయితే చూపించాల్సిందే. గతంతో పోలిస్తే ఇప్పుడు తెలుగు సినిమాలు మారాయి. ప్రేక్షకుల ఆలోచనలు కూడా మారాయి. కాబట్టి ఇప్పుడు విషాదాంతాల్ని కూడా కొంత వరకు రిసీవ్ చేసుకుంటున్నారు. కానీ చిరు అభిమానులు ఆయన పాత్ర చనిపోతే తట్టుకోగలరా.. దాన్ని అంగీకరిస్తారా.. నిరాశ చెందరా అన్నది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English