ఇక బాలీవుడ్ ఆశ‌లు ఆ భారీ చిత్రం మీదే..

ఇక బాలీవుడ్ ఆశ‌లు ఆ భారీ చిత్రం మీదే..

బాహుబ‌లిని చూసి నేర్చుకోండి అంటూ కొన్నేళ్ల కింద‌ట బాలీవుడ్ వాళ్ల‌కు గ‌ట్టిగా గ‌డ్డి పెట్టాడు లెజెండ‌రీ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌పూర్. ఎంతో మార్కెట్ ఉన్న‌ బాలీవుడ్ ఇలాంటి భారీ చిత్రాలు ఎందుకు తీయ‌దు.. రాజ‌మౌళిలా అక్క‌డి ద‌ర్శ‌కులు ఎందుకు పెద్ద క‌ల‌లు క‌న‌రు అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ మాట‌ల‌తో పౌరుషం వ‌చ్చిందో ఏమో కానీ.. గ‌త కొన్నేళ్ల‌లో బాలీవుడ్ వాళ్లు కొన్ని భారీ ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ ఆ ప్ర‌య‌త్నాల‌న్నీ బెడిసికొట్టాయి.

హృతిక్ రోష‌న్ హీరోగా న‌టించింది మొహెంజ‌దారో.. ఆమిర్ ఖాన్-అమితాబ్ బ‌చ్చ‌న్ క‌ల‌యిక‌లో వ‌చ్చిన థ‌గ్స్ ఆఫ్ హిందుస్థాన్.. వ‌రుణ్ ధావ‌న్-ఆలియాభ‌ట్-సంజ‌య్ ద‌త్ కాంబినేష‌న్లో వ‌చ్చిన క‌ళంక్.. ఇలా హిందీలో వ‌చ్చిన భారీ చిత్రాల‌న్నీ బోల్తా కొట్టాయి.

ఇప్పుడు క‌ర‌ణ్ జోహార్ నిర్మిస్తున్న బ్ర‌హ్మాస్త్ర ఏమ‌వుతుందో చూడాలి. ఐతే దీని కంటే కూడా క‌ర‌ణ్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోయే ఓ భారీ చిత్రం మీద ఇప్పుడు బాలీవుడ్ దృష్టి నిలిచి ఉంది. అదే.. త‌క్త్. ర‌ణ్వీర్ సింగ్, క‌రీనా క‌పూర్, ఆలియా భ‌ట్, విక్కీ కౌశ‌ల్‌, జాన్వి క‌పూర్, అనిల్ క‌పూర్ లాంటి భారీ తారాగ‌ణంలో పెద్ద బ‌డ్జెట్లో క‌ర‌ణ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడు. కొత్త ర‌చ‌యిత‌ల‌తో స్క్రిప్టు రెడీ చేయించి.. త్వ‌ర‌లోనే ఈ సినిమాను ప‌ట్టాలెక్కించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు.

క‌ర‌ణ్ కెరీర్లో ఇదే అత్య‌ధిక బ‌డ్జెట్ సినిమా అట‌. రెండు ద‌శాబ్దాల‌కు పైగా కెరీర్లో క‌ర‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన పూర్తి స్థాయి సినిమాలు ఆరే. నిర్మాత‌గా తీరిక లేకుండా సినిమా చేస్తున్న అత‌ను.. ఎప్పుడో కానీ డైరెక్ట్ చేయ‌లేదు. యే దిల్ హై ముష్కిల్ త‌ర్వాత త‌క్త్‌తోనే ద‌ర్శ‌కుడిగా ప‌ల‌క‌రించ‌నున్న క‌ర‌ణ్‌.. భారీ ప్ర‌ణాళిక‌ల‌తో రంగంలోకి దిగుతున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English