ఆ హీరోకు హిట్ల మీద హిట్లు.. క‌ల్ట్ స్టేట‌స్

ఆ హీరోకు హిట్ల మీద హిట్లు.. క‌ల్ట్ స్టేట‌స్

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన బాలీవుడ్ న‌టుడు ఆయుష్మాన్ ఖురానా. ప‌దేళ్ల కింద‌ట అత‌ను ఐపీఎల్‌లో యాంక‌ర్‌గా ప‌ని చేసేవాడు. సీరియ‌ళ్ల‌లో కూడా క‌నిపించాడు. ఆపై అనుకోకుండా సినిమాల్లోకి అడుగు పెట్టాడు. జాన్ అబ్ర‌హాం ఆయుష్మాన్  ప్ర‌తిభ‌ను గుర్తించి అత‌ణ్ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ త‌న సొంత బేన‌ర్లో విక్కీ డోన‌ర్ చిత్రాన్ని నిర్మించాడు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ట‌యిందో.. ఆయుష్మాన్‌కు ఎంత పేరొచ్చిందో తెలిసిందే.

ఐతే ఆ స‌క్సెస్‌ను త‌ల‌కెక్కించుకోకుండా.. త‌ప్ప‌ట‌డుగులు వేయ‌కుండా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాడు ఆయుష్మాన్. ద‌మ్ ల‌గా కీ హైసా.. నోటంకీ సాలా.. బ‌రేలీ కీ బ‌ర్ఫీ.. అందాదున్.. బ‌దాయి హో.. ఆర్టిక‌ల్ 15.. ఇలా వ‌రుస‌గా అద్భుత‌మైన చిత్రాల్లో న‌టించి త‌న స్థాయిని అమాంతం పెంచుకున్నాడు. ఇప్పుడ‌త‌ను డ్రీమ్ గ‌ర్ల్ అనే కొత్త సినిమాతో ప‌ల‌క‌రించాడు. రాజ్ శాండిల్య డైరెక్ష‌న్లో ఏక్తా క‌పూర్ నిర్మించిన ఈ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుని మంచి వ‌సూళ్ల‌తో సాగిపోతోంది. ఎప్ప‌ట్లాగే ఆయుష్మాన్ న‌ట‌న‌ను అంద‌రూ పొగిడేస్తున్నారు.

ఏడాది వ్య‌వ‌ధిలో అందాదున్, బ‌దాయి హో, ఆర్టిక‌ల్, డ్రీమ్ గ‌ర్ల్.. ఇలా ఏకంగా నాలుగు హిట్లు కొట్ట‌డంతో ఆయుష్మాన్ పేరు బాలీవుడ్లో మార్మోగిపోతోంది. ఇప్పుడు మీడియం రేంజి హీరోల్లో అత‌డిని ఆమిర్ ఖాన్ లాగా చూస్తున్నారు. ఆమిర్ లాగే అత‌ను కూడా ప్రేక్ష‌కుల్లో న‌మ్మ‌కం సంపాదించుకున్నాడు. ఆయుష్మాన్ సినిమా అంటే ప్ర‌త్యేకంగా ఉంటుంద‌ని.. అత‌డి కోస‌మైనా సినిమా చూడొచ్చ‌ని భ‌రోసాతో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వెళ్తుండ‌టం విశేషం. ఇలాంటి గుర్తింపు చాలా కొద్దిమందికే ద‌క్కుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English