సుక్కు ఎంట్రీ అదిరిపోయిందిగా..

సుక్కు ఎంట్రీ అదిరిపోయిందిగా..

తెలుగులో మరో టాప్ టెక్నీషియన్ తెరంగేట్రం చేశాడు. దర్శకుడిగా కాస్త పేరు సంపాదించాక చాలామంది తమ చిత్రాల్లో క్యామియోలు చేయడానికి ట్రై చేస్తుంటారు. అలాగే వేరే వాళ్ల చిత్రాల్లోనూ తళుక్కుమంటుంటారు. ఇదే కోవలో సుకుమార్ సైతం ముఖానికి రంగేసుకున్నారు. టాలీవుడ్ లేటెస్ట్ రిలీజ్ ‘గ్యాంగ్ లీడర్’లో ఆయన క్యామియో చేయడం విశేషం. సినిమా ముగింపు దశలో ఆయన తెరపై కనిపించారు.

ఈ చిత్రంలో నాని రైటర్ పాత్ర చేసిన సంగతి తెలిసిందే. అతను హాలీవుడ్ సినిమాల్ని చూసి డిట్టో దించేస్తూ నవలలు రాస్తుంటాడు. కానీ అనుకోకుండా ఐదుగురు ఆడవాళ్ల రివెంజ్‌లో భాగమై.. వాళ్లతో జర్నీనే కథగా మలుస్తాడు. ఇది దర్శకుడైన సుకుమార్ కళ్లలో పడి.. దాని ఆధారంగా సినిమా తీయాలనుకుంటాడు. ఇలా కొసమెరుపులా సినిమాలో సుక్కు ఎంట్రీ ఉంటుంది.

తాను తెలుగు సినిమాలు తీస్తుంటానని సుక్కు పరిచయం చేసుకుంటే.. తాను తెలుగు సినిమాలు పెద్దగా చూడనని.. మీరెవరో నాకు తెలియదు అని నాని అంటాడు. ఈ సీన్ భలేగా పేలింది. ముగింపులో ప్రేక్షకులు నవ్వుతూ థియేటర్ నుంచి బయటికి వచ్చేలా చేసింది. సుక్కు నటుడిగా కనిపించిన తొలి సినిమా ఇదే.

తనకు సొంత సంస్థ లాంటి మైత్రీ మూవీ మేకర్స్ వాళ్ల చిత్రం కావడంతో సుక్కు ఈ క్యామియోకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. విశేషం ఏంటంటే.. ఇంకో వారం రోజుల్లోనే సుక్కు మరోసారి వెండితెరపై తళుక్కుమనబోతున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన ‘వాల్మీకి’లోనూ సుక్కు క్యామియో చేశాడు. ఆ సినిమాలో కూడా సుక్కు తన ఒరిజినల్ పాత్రలోనే కనిపించనున్నాడట. దర్శకుడిగానే దర్శనమిస్తాడట. మరి ఆ చిత్రంలో సుక్కు ఎలా మురిపిస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English