అన్ని ఎలివేషన్లూ కేజీఎఫ్‌లు కావు

అన్ని ఎలివేషన్లూ కేజీఎఫ్‌లు కావు

సినీ పరిశ్రమలో అప్పుడప్పుడూ కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. కొన్ని చిత్రాలు అనుకోకుండా హైప్ తెచ్చుకుంటాయి. అంచనాల్ని తలకిందులు చేస్తూ అనూహ్య విజయం సాధిస్తుంటాయి. బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తుంటాయి. కన్నడ సినిమా ‘కేజీఎఫ్’ ఆ కోవకే చెందుతుంది. ఓ కన్నడ చిత్రం కర్ణాటక దాటి వేరే చోట్ల రిలీజవడమే గగనం అంటే.. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఇరగాడేసింది. భారీ వసూళ్లతో అన్ని చోట్లా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

దీంతో అప్పటిదాకా కర్ణాటక దాటి వేరే ప్రాంతాల వైపు చూడని కన్నడ నిర్మాతలకు ఆశ పుట్టింది. ఇక అక్కడ తెరకెక్కే ప్రతి పెద్ద సినిమానూ వేరే భాషల్లో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు మొదలైపోయాయి. ఈ క్రమంలో కిచ్చా సుదీప్ తన కొత్త చిత్రం ‘పహిల్వాన్’ను ‘కేజీఎఫ్’ తరహాలోనే పాన్ ఇండియా మూవీగా రిలీజ్‌కు ప్లాన్ చేసుకున్నాడు.

‘కేజీఎఫ్’ తరహాలోనే ఈ చిత్రంలో విపరీతమైన హీరో ఎలివేషన్లు పెట్టుకున్నాడు. మాస్‌ను ఊపేసే హీరోయిజం సెట్ చేసుకున్నాడు. దక్షిణాదిన వచ్చిన చాలా కమర్షియల్ సినిమాల్ని కలిపి కొట్టి ఈ సినిమా తీశాడు. కానీ ఇది కన్నడిగులకు ఎలా అనిపించిందో కానీ.. వేరే భాషలన్నింట్లో నెగెటివ్ టాక్ వచ్చింది. రివ్యూలు ఏమీ బాగా లేవు. ప్రేక్షకుల స్పందనా అంతంతమాత్రంగా ఉంది. కర్ణాటక దాటి ఎక్కడా ‘పహిల్వాన్’కు సరైన ఓపెనింగ్స్ లేవన్నది ట్రేడ్ వర్గాల సమాచారం.

‘కేజీఎఫ్’ సినిమాతో ప్రేక్షకులు కనెక్ట్ కావడానికి చాలా కారణాలున్నాయి. కేవలం హీరో ఎలివేషన్లు మాత్రమే ఆ సినిమాను ఆడించేయలేదు. అందులో ఒక ఎమోషన్ కనిపిస్తుంది. టేకింగ్‌ చాలా కొత్తగా ఉంటుంది. ప్రతి ఫ్రేమ్‌లో రిచ్‌నెస్ కనిపిస్తుంది. సాంకేతిక ఆకర్షణల భలేగా కుదిరాయి. ఇక అన్నిటికీ మించి దాని కథాంశం, బ్యాక్ డ్రాప్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మొత్తంగా చెప్పాలంటే ఆ సినిమా లుక్కే వేరు. అలాంటి మ్యాజిక్స్ అన్నిసార్లూ, అందరికీ జరగవు. కేవలం హీరో ఎలివేషన్లతో ప్రేక్షకుల మనసులు గెలవాలంటే కష్టం. కాబట్టి సుదీప్ ఈసారి కొత్తగా ఏదైనా ట్రై చేస్తే బెటర్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English