ఆ సీక్రెట్ నానికి తెలియదు.. ఆమెకు తెలుసు

ఆ సీక్రెట్ నానికి తెలియదు.. ఆమెకు తెలుసు

సినీ జనాలకు సెంటిమెంట్లు, ప్రత్యేకమైన అలవాట్లు ఉండటం గమనిస్తుంటాం. దర్శకుల్లో కూడా కొందరు కొన్ని సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారు. ఇష్క్, మనం లాంటి సినిమాలతో మురిపించిన దర్శకుడు విక్రమ్ కె.కుమార్.. తన ప్రతి సినిమాలోనూ కథానాయికకు ప్రియ అని పేరు పెట్టడం గమనించే ఉంటారు.

13బి మొదలుకుని.. దాదాపుగా ప్రతి సినిమాలోనూ కథానాయిక పాత్రకు అదే పేరు పెడుతున్నాడు. ఇప్పుడు నాని హీరోగా ఆయన రూపొందించిన ‘గ్యాంగ్ లీడర్’లోనూ హీరోయిన్ పేరు ప్రియనే అంటున్నారు. మరీ ఈ పేరు విషయంలో ఇంత సెంటిమెంట్ ఏంటి అని ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది అందరికీ. ఆ పేరు విషయంలో విక్రమ్ అంత పర్టికులర్‌గా ఎందుకు ఉంటాడు అనే సందేహం జనాల్లో ఉంది.

‘గ్యాంగ్ లీడర్’ ప్రమోషన్లలో భాగంగా ఓ కార్యక్రమంలో యాంకర్ సుమ ఈ విషయంపై విక్రమ్‌కు సూటి ప్రశ్న వేసింది. విక్రమ్ కాస్త ఓపెన్ అయినట్లే అయి.. అసలు విషయం మాత్రం చెప్పలేదు. ప్రియ అనేది చాలా అందమైన పేరని.. ఆ పేరులోని సౌండింగే చాలా బాగుంటుందని.. అందుకే ఆ పేరు తన హీరోయిన్లకు పెడతానని చెప్పాడు విక్రమ్. కానీ ఈ పేరుతో తనకు డీప్ కనెక్షన్ ఉందని చెప్పిన విక్రమ్.. ఆ కనెక్షన్ ఏంటన్నది మాత్రం వెల్లడించలేదు. దాని గురించి మాట్లాడలేను అనేశాడు.

పక్కనే ఉన్న నాని అందుకుని.. ప్రియ అనేది విక్రమ్ భార్య పేరు కూడా కాదని.. దాని వెనుక ఏం కథ ఉందో తెలుసుకుందామని ‘గ్యాంగ్ లీడర్’ షూటింగ్ టైంలో ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని చెప్పాడు. ఐతే అంతలోనే హీరోయిన్ ప్రియాంక మోహన్ అందుకుని.. ఆ పేరు వెనుక స్టోరీ తనకు తెలుసని.. కానీ దాని గురించి తాను చెప్పనని అంది. దీంతో నాని ఒకింత ఆశ్చర్యపోతూ.. విక్రమ్‌తో ఎంతో కాలంగా పరిచయం ఉన్న తనకు మాత్రం ఈ సీక్రెట్ చెప్పకుండా.. నిన్న కాక మొన్న వచ్చిన ప్రియాంకకు చెప్పడం అన్యాయం అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English