కంగ‌నా షాకింగ్ లుక్.. ఇంకొన్ని రోజుల్లో

కంగ‌నా షాకింగ్ లుక్.. ఇంకొన్ని రోజుల్లో

సినిమా సినిమాకూ అవ‌తారం మార్చేస్తూ.. న‌టిగా త‌న‌లోని కొత్త కోణాలు చూపిస్తూ ఆశ్చ‌ర్య ప‌రుస్తూ ఉంటుంది బాలీవుడ్ భామ‌ కంగ‌నా ర‌నౌత్. ఆమె నోటి దురుసు, అన‌వ‌స‌ర వివాదాలు రాజేయ‌డం గురించి ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. న‌టిగా కంగ‌నాను వేలెత్తి చూపే అవ‌కాశం లేదు. ఆమె మీద కోపం ఉన్న వాళ్లు కూడా త‌న సినిమాల్లో న‌ట‌న‌కు ఫిదా అయిపోతుంటారు.

తాజాగా జ‌డ్జిమెంట‌ల్ హై క్యా సినిమాతో కంగ‌నాకు ఫ్లాప్ ఎదురైన‌ప్ప‌టికీ.. న‌టిగా మాత్రం మ‌రోసారి ఆమె ఏంటో ఈ సినిమాతో రుజువైంది. ఇప్పుడామె తొలిసారిగా ఓ త‌మిళ చిత్రంలో న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కే చిత్రంలో కంగ‌నా న‌టించ‌నుంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎ.ఎల్.విజయ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయ‌నున్నాడు.

తెలుగువాడైన విష్ణు ఇందూరి నిర్మించే ఈ చిత్రం అక్టోబ‌రు నెలాఖ‌ర్లో సెట్స్ మీదికి వెళ్ల‌నుంద‌ట‌. ఈ ప్రాజెక్టు ఆగిపోయిందంటూ కొన్ని రోజులుగా జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని ఖండిస్తూ.. ప్రి ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జోరుగా సాగుతున్న విష‌యాన్ని వెల్ల‌డించాడు విష్ణు. అంతే కాదు.. ఈ సినిమాలో కంగ‌నాకు మేక‌ప్ వేయ‌డం కోసం కెప్టెన్ మార్వెల్, బ్లేడ్ ర‌న్న‌ర్ లాంటి సినిమాల‌కు ప‌ని చేసిన హాలీవుడ్ మేక‌ప్‌మ్యాన్ జేస‌న్ కొలిన్స్‌ను తీసుకొస్తున్నార‌ట‌.

సినిమాలో జ‌య‌ల‌లిత‌గా వివిధ వ‌య‌సుల్లో క‌నిపిస్తుంద‌ట కంగ‌నా. ఆమె నాలుగు ర‌కాల అవ‌తారాల్లో ద‌ర్శ‌న‌మిస్తుంద‌ట‌. మేకింగ్ టైంలో ఒక్కో ఫేజ్‌లో ఒక్కో బ‌రువు, లుక్‌తో క‌నిపిస్తుంద‌ట ఆమె. మేక‌ప్ ట్రిక్స్ కూడా ఉప‌యోగించి.. జ‌య రూపంలోకి కంగ‌నాను తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌. ముందుగా జ‌య‌ల‌లిత‌గా కంగ‌న షాకింగ్ ఫ‌స్ట్ లుక్ ఒక‌టి రిలీజ్ చేయ‌నున్నార‌ట‌. సినిమా మొద‌ల‌య్యే ముందే ఇది రిలీజ‌వుతుంద‌ని స‌మాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English