సమీక్ష: పహిల్వాన్ - ఓడిపోయాడు

సమీక్ష: పహిల్వాన్ - ఓడిపోయాడు

ఈగ, బాహుబలి సినిమాలతో తెలుగువారికి పరిచయం అయిన కిచ్చా సుదీప్, బాలీవుడ్ స్టార్  సునీల్ శెట్టి, ఆకాంక్ష సింగ్ (దేవదాస్, మళ్లీరావా) లాంటి తారాగణం వుంది. మాంచి మాస్ సినిమా అనిపించే పోస్టర్లు కనిపిస్తున్నాయి. ఇవి చాలు ప్రతివారం సినిమా చూసేయాలి అనే నియమం పెట్టుకున్న ప్రేక్షకులు థియేటర్ కు వెళ్లడానికి. కానీ వెళ్లిన తరువాత కదా అసలు విషయం తెలిసేది. సినిమా ఎలా వుందన్న గుట్టు బయటకు వచ్చేది.

భారతీయ క్రీడల్లో కుస్తీ అన్నది ఎంత ప్రాచీన క్రీడనో, ఈ సినిమా కథ కూడా అంతే పాతది. సినిమాలో ఒక్క పాయింట్ అన్నది కొత్తది వుంటే ఒట్టు. చిన్న చిన్న సినిమాలు ఎక్కువగా చేసే కన్నడ సినిమా జనాలు కూడా తెలుగు సినిమా గాలి సోకి, భారీ సినిమాలు చేస్తున్నారు. అలా భారీగా ఖర్చు పెట్టి తీసారు తప్ప, ఆ భారీ తనానికి సరిపడా కథను కానీ, ఆ కథలో కొత్తదనాన్ని కానీ చొప్పించలేకపోయారు.

అనగనగా ఓ అనాధ. వాడిలోని చురుకుదనం చూసి చేరదీసిన ఓ పహిల్వాన్. ఎప్పటికైనా జాతీయ స్థాయి పహిల్వాన్ ను చేయాలి అని సానపెడతాడు. తీరాచేసి, ఆ కుర్రాడు కాస్తా ప్రేమించి పెళ్లిచేసుకుంటాడు. దీంతో తమ మాట పోయిందని కోపం వచ్చి ఇంటి నుంచి బయటకు పంపిస్తాడు. కుస్తీ వదిలి సంసారంతో కుస్తీ పడుతున్న ఆ యోధుడికి మళ్లీ కుస్తీ పట్టాల్సిన అగత్యం వస్తుంది. అంతే కాదు, బాక్సింగ్ నేర్చుకుని, జాతీయ స్థాయి పోటీకి వెళ్లాల్సిన సమయం వస్తుంది. ఇంకేం అవుతుందో జనాలకు తెలియందా? అందరూ ఊహించినట్లే ముగింపు.

తెలుగునాట దాదాపు ఈ లైన్ తో చాలా సినిమాలు వచ్చాయి. సరే, వచ్చినా కూడా, ఓ మాంచి మాస్ సినిమా చేసుకోగల అవకాశం వుంది. ఎందుకంటే కథ పాతదే అయినా, మాస్ సినిమాకు కావాల్సిన బిల్డప్ సీన్లు, ఎమోషన్లు, లవ్ , ఫన్, ఫ్యామిలీ ఇలా అన్ని దినుసులు వేసుకోగల లైన్ ఇది. పహిల్వాన్ లో కూడా ఇన్ని రకాలు టచ్ చేసారు. కానీ ఏదీ ఇంప్రెసివ్ గా టచ్ చేయలేకపోయారు. కేవలం హీరో బిల్డప్, భారీ ఖర్చు, భారీ ఫైట్లు ఈ మూడింటి మీద పెట్టిన సీరియస్ నెస్ మిగిలిన వాటి మీద కనిపించలేదు.

హీరో, విలన్లు, క్యారెక్టర్ యాక్టర్ లు ఇలా అన్నింటికి బిల్డప్ వుంది. సెట్ లు భారీగా వేసారు. లోకేషన్లు బాగున్నాయి. కానీ ఏ ప్రయోజనం సన్నివేశాల్లో కొత్తదనం తక్కువ. అలాగే ఈ నటులతో ఆ సీన్లు మన ప్రేక్షకులకు పట్టడం మరీ తక్కువ. కిచ్చా సుదీప్ కన్నడం జనాలకు హీరో. మనకు కాదు. అందువల్ల ఫుల్ లెంగ్త్ లో అతన్ని హీరోగా చూడ్డం కాస్త కష్టమే. మన ప్రేక్షకుల వరకు అతన్ని యాక్షన్ సీన్లలో పహిల్వాన్ గా చూడగలరు కానీ, ప్రేమికుడిగా, డ్యాన్సర్ గా చూడడం కష్టం.  అందువల్ల సినిమా తెలుగు ప్రేక్షకుల మీద ఎటువంటి రసానుభూతి మిగల్చదు.

పహిల్వాన్ తొలిసగం చూస్తుంటే అచ్చమైన తమిళ సినిమా చూస్తున్నట్లు వుంటుంది. అందులో కామెడీ సీన్లకు కితకితలు పెట్టుకున్నా నవ్వురాదు. లవ్ సీన్లు చూస్తుంటే ఎక్కడా ఏమీ టచ్ కాదు. ఆ పాటలు, ఆ వ్యవహారం అంతా పేరుకు కన్నడ డబ్బింగ్ నే కానీ, తమిళ వాసన గుప్పు గుప్పుమని కొడుతుంది. ద్వితీయార్థం లోకి వచ్చిన తరువాత అక్కరలేని సాగదీపుడు మరి కొంతు. హీరో కష్టపడి సంసారం ఈదుతున్నాడు అని చెప్పడానికి ప్రపంచం లో వున్న సమస్త పనులు చేయించేసారు. ఇది చాలదన్నట్లు ఇద్దరి విలన్లలో ఓ విలన్ చేసే ఓవర్ యాక్షన్ ఒకటి. ఆ విలన్ ఫ్రేమ్ లోకి వచ్చినపుడల్లా ఇరిటేటింగ్ గా వుంటుంది. పైగా ద్వితీయార్థంలో పాటలు ఏమిటో? ఎందుకు వస్తున్నాయో? అర్థం కాదు. ఇది చాలక ఉన్నట్లుండి చివరిలో హీరోయిజం మరింత ఎలివేట్ కావడం కోసం, ఓ సోషల్ కాజ్, దాని కోసం మరి కొంత ఫుటేజ్.

ఒక విలన్ వ్యవహారం ముగించడం కోసం చేయాల్సింది అంతా చేసి, మళ్లీ మరో విలన్ వ్యవహారం కోసం మొదట్నించీ మొదలెట్టి, ఫినిష్ చేయడం. దీంతో పే..ద్ద సినిమా చూసిన ఫీలింగ్ కూడానూ. ఇలా అన్ని విధాలా తెలుగు ప్రేక్షకులను అయితే తన విద్యతో పహిల్వాన్ భయపెడతాడు కానీ, దగ్గరకు వెళ్లి చూడాలనిపించడు.

కిచ్చా సుదీప్ మేకోవర్ బాగానే వుంది. కానీ మేకోవర్ వల్ల మొహం కాస్త మారిపోయి, అంత చూసేలా లేదు. సునీల్ శెట్టి ని చూస్తే, తెలుగువాళ్లకు ఓ మంచి విలన్ నో, క్యారెక్టర్ గానో ట్రయ్ చేయచ్చు అనిపిస్తుంది. ఇంకేవరి గురించి చెప్పుకోవడానికి లేదు.

సినిమాకు బోలెడు ఖర్చు చేసారు కాబట్టి విజువల్ గా బాగానే వుంది. నేపథ్య సంగీతం ఓకె కానీ ఒక్క పాట అక్కడిక్కడే హమ్ చేయడానికి కూడా వీలు కాదు.

మొత్తం మీద ఈ పహిల్వాన్ మన కోసం కాదు.

చివరగా: పహిల్వాన్-ఓడిపోయాడు

రేటింగ్-2.25/5

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English