‘బంగార్రాజు’కు మళ్లీ బ్రేకా?

‘బంగార్రాజు’కు మళ్లీ బ్రేకా?

అక్కినేని నాగార్జున కెరీర్లో మైలురాయిలా నిలిచిపోయిన పాత్రల్లో బంగార్రాజు ఒకటి. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాలో నాగ్ ఈ పాత్ర చేశాడు. ఆయన కెరీర్ మొత్తంలో ఈ స్థాయిలో అలరించిన పాత్రలు అరుదుగా కనిపిస్తాయి. నాలుగేళ్ల కిందట సంక్రాంతి పండక్కి వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లతో నాగ్ కెరీర్లోనే హైయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఇంత బాగా క్లిక్ అయిన పాత్రను అలా వదిలేయకుండా.. ఆ పాత్ర చుట్టూ కథ నడుపుతూ మరో సినిమా చేయాలన్నది నాగ్ ఆలోచన.

‘బంగార్రాజు’ అనే టైటిల్‌తో ‘సోగ్గాడే..’కి ప్రీక్వెల్ చేసేందుకు కొన్నేళ్ల కిందట్నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘సోగ్గాడే..’ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ.. సీనియర్ రచయిత సత్యానంద్‌తో కలిసి చాన్నాళ్లుగా ఈ స్క్రిప్టు మీద పని చేస్తున్నాడు. ఐతే ఈ కథను ఓకే చేయక నాన్చుతూ వస్తున్న నాగ్.. ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలొచ్చాయి.

సొంత బేనర్లో త్వరలోనే నాగ్ ‘బంగార్రాజు’ను మొదలుపెడతాడని.. ఆయన పెద్ద కొడుకు నాగచైతన్య ఇందులో మరో కథానాయకుడిగా నటిస్తాడని ప్రచారం జరిగింది. నాగ్, చైతూ కూడా ఈ విషయంలో సానుకూలంగానే స్పందించారు. కానీ ఇప్పుడు మళ్లీ ఈ ప్రాజెక్టు డోలాయమానంలో పడ్డట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ స్క్రిప్టు మీద నాగ్ పూర్తి సంతృప్తితో లేడని.. ఇంకొంత వర్క్ చేయాలని కళ్యాణ్‌కు చెప్పాడని.. దీని బదులు నాగ్ వేరే సినిమాను త్వరలోనే మొదలు పెడుతున్నాడని అంటున్నారు.

‘మహర్షి’ సినిమా కథకుడైన సాల్మన్‌కు నాగ్ అవకాశమిస్తున్నాడన్నది తాజా సమాచారం. అతను చెప్పిన కథ నచ్చి తననే దర్శకుడిగా పరిచయం చేస్తూ సొంత బేనర్లో సినిమా మొదలుపెట్టనున్నాడట నాగ్. కొత్త దర్శకులకు అవకాశాలివ్వడంలో నాగ్ ట్రాక్ రికార్డు గురించి తెలిసిందే. మరి ‘బంగార్రాజు’ ఎప్పటికి పట్టాలెక్కుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English