‘బిగ్ బాస్’ అభిమానులు జారిపోతున్నారా?

‘బిగ్ బాస్’ అభిమానులు జారిపోతున్నారా?

తెలుగు ‘బిగ్ బాస్’ ఆరంభం కావడానికి ముందు ఈ షో మన దగ్గర ఏమాత్రం విజయవంతం అవుతుందో అన్న సందేహాలు కలిగాయి. కానీ వాటిని పటాపంచలు చేస్తూ తొలి సీజన్లో ఈ షో ఇంటింటికీ వెళ్లిపోయింది. భారీగా ఫాలోవర్లను సంపాదించుకుంది. ఫ్యామిలీ లేడీస్ సైతం ఈ షోను విరగబడి చూశారు. ఇళ్లల్లో బిగ్ బాస్ చర్చలు పెద్ద ఎత్తున జరిగాయి. తొలి సీజన్‌కు ఎన్టీఆర్ అతి పెద్ద ఆకర్షణగా నిలిచాడు. పార్టిసిపెంట్లు కూడా తమ స్థాయిలో షోను బాగానే రక్తి కట్టించారు.

రెండో సీజన్లో ఎన్టీఆర్ స్థానంలో నాని రావడం ఒకింత నిరాశ కలిగించినా.. అతను ఓ మోస్తరుగా షోను నడిపించేశాడు. హోస్ట్ సంగతెలా ఉన్నా కౌశల్ కారణంగా షో రక్తి కట్టింది. బాబు గోగినేని లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అతడికి పోటీగా నిలవడం.. హౌస్‌లో రసవత్తర పోరాటాలు సాగడం.. సోషల్ మీడియా మోతెక్కిపోవడంతో షో సూపర్ హిట్టయింది.

మూడో సీజన్‌ మరింత రసవత్తరంగా ఉంటుందని ఆశిస్తే.. అంచనాల్ని అందుకోలేకపోతోంది. ‘మీలో కోటీశ్వరుడు’ అనుభవంతో అక్కినేని నాగార్జున ‘బిగ్ బాస్’ను తన హోస్టింగ్ స్కిల్స్‌తో రక్తి కట్టిస్తాడనుకుంటే అలాంటిదేమీ జరగట్లేదు. నాగ్ అభిమానులు ఫీలైతే కావచ్చు కానీ.. ఆయన షోను అంత బాగా నడిపించట్లేదన్నది వాస్తవం. ఎన్టీఆర్ తరహాలో నాటకీయంగా షోను నడిపించడంలో, బాగా ప్రిపేరై వచ్చి పార్టిసిపెంట్లను కమాండ్ చేయడంలో, స్పాంటేనిటీతో వినోదం పండించడంలో నాగ్ విఫలమవుతున్నాడు. దీనికి తోడు పార్టిసిపెంట్లు కూడా అంతంతమాత్రంగానే ఉన్నారు.

కౌశల్-బాబు పోరు తరహాలో ఈసారి హోరాహోరీ అనే మాటే లేదు. ఆ తరహా టిపికల్ క్యారెక్టర్లు, స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఈ సీజన్లో కనిపించడం లేదు. అసలు గొడవలు, వివాదాలు లేకుంటే బిగ్ బాస్ రక్తికట్టదు. కానీ ప్రస్తుత పార్టిసిపెంట్లలో దాదాపుగా అందరూ కాంప్రమైజ్ అయ్యేవాళ్లే. ఏదో అలా సాగిపోతోంది తప్పితే.. ప్రేక్షకుల్లో ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ కలిగించడంలో ‘బిగ్ బాస్’ మూడో సీజన్ విఫలమవుతోందన్నది విశ్లేషకులు, వీక్షకుల మాట. దీంతో చాలామంది మధ్యలోనే షో చూడటం మానేస్తున్నట్లుగా తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English